Friday, April 26, 2024

ఐసీసీ పాయింట్ల పట్టికలో భారత్‌ రెండో స్థానం..

ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఆశలు భారత్‌కు సజీవంగానే ఉన్నాయి. తాజాగా బంగ్లాపై విజయంతో భారత్‌ పాయింట్ల పట్టికలో ద్వితీయ స్థానాన్ని నిలబెట్టుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన భారత్‌ వరల్డ్‌ టెస్టుచాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) రేసులోకి వచ్చింది. ఐసీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 58.93 శాతం విజయాలు, 99 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 76.92 శాతం విజయాలు, 120 పాయింట్లతో ఆస్ట్రేలియా టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (54.55 శాతం) 72 పాయింట్లతో మూడో ప్లేస్‌కు పడిపోయింది. ఆసియా జట్లలో శ్రీలంక నాలుగో స్థానంలో పాకిస్థాన్‌ 7, బంగ్లాదేశ్‌ 9వ స్థానంలో ఉన్నాయి.

ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి టెస్టులో ఆ జట్టు ఘోరంగా ఓడిపోవడం భారత్‌కు కలిసొచ్చింది. ఒక వేళ దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్టుల్లో నెగ్గితే పాయింట్ల పట్టికలో టీమిండియాను దాటేసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి వస్తే భారత్‌ వచ్చే ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాలంటే స్వదేశంలో జరిగే బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఓడించాలి. ఇంగ్లండ్‌లో వచ్చే ఏడాది జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది.

గత ఏడాది వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీని టీమిండియా చేజార్చుకుంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. దాంతో ఈ సారి ఎలాగైనా టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీ గెలవాలనే కసితో ఉంది. మిర్‌పూర్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. టాపార్డర్‌ విఫలం కావడంతో ఒక దశలో భారత్‌ మ్యాచ్‌ ఓడిపోయేలా కనిపించింది. కానీ, అశ్విన్‌ 42, శ్రేయాస్‌ అయ్యర్‌ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement