Saturday, April 20, 2024

ర‌ష్యా – ఉక్రెయిన్ శాంతి చ‌ర్చ‌ల‌కు భార‌త్ సంపూర్ణ మ‌ద్ద‌తు – ప్ర‌ధాని మోడి…

న్యూ ఢిల్లీ – రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ ఒత్తిడి చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. కొవిడ్​, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం యావత్​ ప్రపంచంపై పడిందని అన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్​కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్​కు ప్రధాని ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం పలికాయి. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్​లో మోడీ, షోల్జ్ మాట్లాడారు.

మోడీ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు భారత్‌ సూచిస్తూనే ఉందని అన్నారు. ఎలాంటి శాంతి చర్చలకైనా సహకరించేందుకు భారత్​ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి దౌత్యం, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ నొక్కి చెబుతోందని మోడీ పేర్కొన్నారు. కొవిడ్​, ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం యావత్​ ప్రపంచం అనుభవించిందని అన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య పరస్పర సహకారం ఉంద‌న్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు గట్టి చర్యలు అవసరమని ఇరు దేశాలు నమ్ముతున్నాయ‌న్నారు. యూరప్‌లో భారత్​కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులకు ముఖ్యమైన వనరు కూడా అని తెలిపారు. అలాగే భారత్​, జర్మనీ మధ్య బలమైన సంబంధాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయ‌ని,. గత కొన్నేళ్లుగా భారత్​, జర్మనీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయ‌ని మోడీ అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతోందని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్‌ షోల్జ్ తెలిపారు. హింసతో దేశ సరిహద్దులను ఎవరూ మార్చలేరని ఆయన నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం వల్ల అపారమైన నష్టం, విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఈ యుద్ధాన్ని ఒక విపత్తుగా అభివర్ణించారు. “భారత్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అది భారత్, జర్మనీ మధ్య సంబంధాలకు చాలా మంచిది. రష్యా దురాక్రమణ పర్యవసానాలతో ప్రపంచం అల్లాడిపోతోంది. దాదాపు 1,800 జర్మన్ కంపెనీలు భారత్​లో ఉన్నాయి. అవి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. మాకు ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. సాఫ్ట్‌వేర్ రంగం భారత్​లో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు భారత్​లో ఉన్నాయి. అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement