Thursday, April 18, 2024

ఓడి గెలిచిన ఐర్లాండ్‌.. అతికష్టంగా సిరీస్‌ కొట్టిన భారత్‌

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో భారత్‌ ఎట్టకేలకు విజయం సాధించినప్పటికీ అద్భుతంగా ఆడిన ఐర్లాండ్‌ క్రికెట్‌ అభిమానుల ఆదరణను పొందింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ధాటీగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లలో దీపక్‌ హుడా తన తొలి సెంచరీని నమోదు చేయగా సంజు శాంసన్‌ అర్ధ శతకం చేశారు. ఆ తరువాత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఐర్లండ్‌ తొలి 5 ఓవర్లలో అతివేగంగా పరుగులు చేసి 50 పరుగుల మార్క్‌ను దాటేసింది.

పసికూనలాంటి ఐర్లండ్‌ జట్టు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని మొత్తం 20 ఓవర్లూ ఆడటం గమనార్హం. చివర్లో ఒత్తిడి తట్టులేక, అనుభవం లేక ఓటమి పాలైందే తప్ప భారత్‌ ప్రదర్సన ఏమంత బాగోలేదు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ చేశారు. అయినప్పటికీ 13 పరుగులు చేసి ఐర్లాండ్‌ సత్తా చాటింది. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌ ధైర్యంగా ఆడుతూండటంతో ఒత్తిడి పెంచేందుకే చివరి ఓవర్‌ను ఉమ్రాన్‌ మాలిక్‌కు ఇచ్చానని భారత జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చెప్పాడు.

అయినప్పటికీ ఐర్లాండ్‌ జట్టు అద్భుతంగా ఆడిందని ప్రశంసించారు. ఐర్లాండ్‌ ఆటగాళ్లలో కెప్టెన్‌ ఆండ్రూ బాల్‌బిర్నీ (60), పాల్‌ స్టిర్లింగ్‌ (40), హారీ టెక్టర్‌ (39) చక్కగా ఆడినప్పటికీ చివర్లో భారత బౌలర్లు దూకుడుతో ఓటమి పాలయ్యారు. అయితే, చివరి బంతి వరకు ఆడటం, ఎక్కడా ఒత్తిడికి లోనవకపోవడంతో ప్రేక్షకుల మద్దతు పొందారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement