Sunday, September 24, 2023

CNG | పెరుగుతున్న సీఎన్జీ కార్లు.. పదేళ్లలో 25 శాతం అవే ఉంట‌య్‌

దేశంలో దశాబ్దం చివరి నాటికి పరిశ్రమలో 25 శాతం సీఎన్జీ కార్లు ఉంటాయని టాటా మోటార్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా పర్సనల్‌ సిగ్మెంట్‌లో సీఎన్జీ కార్ల వినియోగం క్రమంగా పెరుగుతుందని చెప్పారు. మార్కెట్‌లో కనీసం 17-18 మోడల్స్‌ సీఎన్జీ కార్లు ఉండాలని, దేశంలో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య గణనీయంగా పెరగాలని ఈ రెండు అంశాలపై ఆధారపడి సీఎన్జీ కార్ల వినియోగం పెరుగుతుందన్నారు. మూడు సంవత్సరాల క్రితం దేశంలో 1,500 సీఎన్జీ స్టేషన్లు ఉంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 5,500కు చేరిందన్నారు. ముఖ్యంగా ఢిల్లి, హర్యానా, మహారాష్ట్రల్లో సీఎన్జీ స్టేషన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. అందువల్లే ఈ రాష్ట్రాల్లో సీఎన్జీ కార్ల సంఖ్య చాలా ఎక్కువని చెప్పారు.

- Advertisement -
   

గత సంవత్సరం దేశంలో మొత్తం 4 లక్షల సీఎన్జీ కార్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో టాటా మోటార్స్‌ 50వేల కార్లను విక్రయించిందని చెప్పారు. ప్రస్తుతం టాటా మోటార్స్‌ ఇటీవలే కొత్త సీఎన్జీ ఆల్ట్రోజ్‌ను విడుదల చేసిందని శైలేష్‌ చంద్ర చెప్పారు. త్వరలోనే పంచ్‌ మోడల్‌లోనూ సీఎన్జీ కారును విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం కార్ల అమ్మకాల్లో సీఎన్జీ కార్ల వాటా 10-12 శాతం వరకు మాత్రమే ఉందని, ఈ దశాబ్దం చివరి నాటికి ఈ వాటా 25 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. దేశంలో 2030 నాటికి 20-25 శాతం సీఎన్జీ, 25-30 శాతం వరకు విద్యుత్‌ కార్లు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో కస్టమర్లు సిడాన్‌ కార్ల కంటే ఎస్‌యూవీ పట్ల ఎక్కు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. త్వరలోనే సిడాన్‌ కార్ల వాటా ప్రస్తుతం ఉన్న 21-22 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతుందని చెప్పారు. ఎస్‌యూవీల సిగ్మెంట్‌ వేగంగా పెరుగుతుందన్నారు.

రానున్న కాలంలో ఎక్కువగా కార్ల విభాగంలో విద్యుత్‌ కార్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ వాహనాలు వస్తాయన్నారు. ఇప్పటికే కమర్షియల్‌ వాహనాలను హైడ్రజన్‌తో పరీక్షిస్తున్నారని, ఈ సిగ్మెంట్‌లో ఎక్కువగా హైడ్రోజన్‌ వాహనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. టాటా మోటార్స్‌ 2024లో కర్వ్‌, 2025లో సియెర్రా ఎస్‌యూవీ కార్లను మార్కెట్లో విడుదల చేస్తుందన్నారు. ఈ కార్లు 4.3 మీటర్ల పొడవుతో ఉంటాయని, ఎస్‌యూవీ విభాగంలో ఈ కార్లకు భారీగా డిమాండ్‌ పెరుగుతుందన్నారు. వీటితో పాటు మొత్తం 7 కొత్త మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు శైలేష్‌ చంద్ర వివరించారు. వీటిలో మరో విద్యుత్‌ కారు ఉంటుందని, సీఎన్జీ కార్లను కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు టాటా మోటార్స్‌ మార్కెట్‌కు అనుగుణంగా కొత్త మోడల్స్‌ను తీసుకు వస్తుందని తెలిపారు. విద్యుత్‌ కార్ల విషయంలో నూతన సాంకేతికత అందుబాటులో వచ్చిన ప్రతిసారి అప్‌డేట్‌ చేస్తుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement