Saturday, March 23, 2024

Big Story | ఏపీలో పెరిగిన భూముల ధరలు.. అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ

అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూముల ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఒకసారి రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే భూముల ధరల పెంపుకు ఆమోదముద్ర వేసింది. ఈమేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నుండి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మార్కెట్‌ వాల్యూ స్పెషల్‌ రివిజన్‌పై అందిన ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈతాజా నిర్ణయంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చి చేరనుంది. గత ఏడాది స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా రూ. 8 వేల కోట్ల ఆదాయం లభించగా ఈ ఏడాది దానిని రూ. 12 వేల కోట్లకు పెంచుతూ లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు.

ఈమేరకు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకుగానూ రాష్ట్రంలో మార్కెట్‌ విలువకు, ప్రభుత్వ విలువకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో భూముల ధరలను పెంచడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగుమం కానుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న భూముల ధరల పెంపు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 20 శాతం మేర భూముల ధరలు పెరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో గతం కంటే మార్కెట్‌ వ్యాల్యూ అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏఏ ప్రాంతాల్లో రేట్లు పెంచనుందన్న విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు. ఈ వివరాలన్నీ స్థానికంగా ఉండే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఆశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

సేకరించిన సమాచారం మేరకు ఈఎంపిక చేసిన భూములకు ఆయా ప్రాంతాలను బట్టి 0 నుండి 30 శాతం వరకూ భూముల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం ప్రాంతంలోని కొన్ని ఏరియాల్లో గరిష్టంగా 50 శాతం వరకూ కూడా ఈ భూముల ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ధరలు జూన్‌ 1వ తేదీ గురువారం నుండి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రతిపాదనలు వచ్చిందిలా

జూన్‌1వ తేదీ నుంచి ఈ ఎంపిక చేసిన 20 శాతం ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ వ్యాల్యూ పెరగనుంది. దానికి సంబంధించి జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు ధరలు నిర్థారిస్తూ జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రభుత్వం ఒకసారి మార్కెట్‌ ధరలు పెంచింది. జిల్లా కేంద్రాలతోపాటు- డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు- హైక్‌ చేసింది. తాజాగా మరోసారి భూముల ధరలు పెంపునకు ఆమోద ముద్ర వేసింది. అయితే.. గతంలో ఎక్కడెక్కడ ధరలు పెంచలేదో ఆయా ప్రాంతాల్లో మాత్రమే ఈసారి భూముల రేట్లు- పెరగనున్నాయి. అందులోనూ.. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న చోటే ప్రభుత్వం ఈధరలు పెంచబోతోంది.

భూముల రేట్ల పెంపు ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో అధికారుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కొత్త ధరలు జాబితా సిద్ధం చేశారు. కనీసం 30నుంచి గరిష్టంగా 50 శాతం వరకూ ధరలు పెరగనున్నట్లు- తెలుస్తోంది. వాస్తవానికి.. గతేడాది జిల్లాల విభజన, భూముల ధరలు పెరుగుదలతో ప్రభుత్వానికి ఆదాయం దండిగా వచ్చింది. సుమారు 8 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నెలకు సగటు-న 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ క్రమంలోనే.. ఆదాయాన్ని మరింత పెంచుకునేలా ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement