Friday, April 26, 2024

Delhi | వీరశైవ లింగాయత్, లింగబలిజలను ఓబీసీ జాబితాలో చేర్చండి.. జాతీయ బీసీ కమిషన్ కృష్ణయ్య విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వీరశైవ లింగాయత్, లింగబలిజ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప, గౌరవాధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి నేషనల్ బీసీ కమిషన్ ఛైర్మన్ హంసరాజ్ గంగారాం ఆహిర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయత్, లింగ బలిజ కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కమిషన్ ఛైర్మన్ ఈ అంశంపై ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తానని హామీ ఇచ్చారని ఆర్. కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి పేదరికంలో ఉన్న ఈ లింగబలిజ, వీరశైవ లింగాయత్ కులాలకు చెందిన ప్రజలు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ పొందకపోవడంతో విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని కృష్ణయ్య అన్నారు. వారిని వెంటనే జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఒకవేళ కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. వీరశైవ లింగాయత్ – లింగ బలిజ సంఘం నేతలు ఈశ్వరప్ప, పట్లోల్ల సంగమేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ బీసీ కమిషన్‌కు నివేదిక పంపి రెండు సంవత్సరాలైనా కేంద్ర స్థాయిలో ఓబీసీ జాబితాలో కలిపే ప్రయత్నం జరగలేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement