Saturday, April 20, 2024

ఉత్త‌ర‌కొరియా ప్యాంగ్యాంగ్ లో.. ఐదు రోజుల లాక్ డౌన్

శ్వాస‌కోశ వ్యాధి బాధితుల సంఖ్య పెర‌గ‌డంతో ఐదు రోజుల లాక్ డౌన్ విధించింది ఉత్త‌ర కొరియా ప్ర‌భుత్వం. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో ఈ లాక్ డౌన్ అమ‌లు కానుంది. దాంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని హెచ్చరించారు. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈమేరకు సియోల్ (దక్షిణ కొరియా రాజధాని) కేంద్రంగా వెలువడే ఉత్తర కొరియా పత్రిక ఒకటి ఈ వివరాలను ప్రచురించింది. ప్యాంగ్యాంగ్ లో లాక్ డౌన్ విషయాన్ని, ప్రభుత్వ నోటీసుతో సహా బుధవారం ప్రచురించింది. ఈ నోటీసులో అధికారులు శ్వాసకోశ వ్యాధి అని పేర్కొన్నప్పటికీ అది కరోనానే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్క దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండొచ్చని దక్షిణ కొరియా సందేహం వ్యక్తం చేస్తోంది. నగరంలో లాక్ డౌన్ గురించి ప్యాంగ్యాంగ్ పౌరులకు ముందే సమాచారం ఉందని, మంగళవారం అక్కడి ప్రజలు పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసి తీసుకెళ్లడం కనిపించిందని ఉత్తర కొరియా వార్తలు ప్రచురించే వెబ్ సైట్ ‘ఎన్ కే న్యూస్’తెలిపింది. దేశంలో జరిగే మిగతా అన్ని విషయాల లాగే కరోనా వ్యాప్తిని కూడా ఉత్తర కొరియా రహస్యంగానే ఉంచుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement