Thursday, March 30, 2023

పోలవరం బ్యాక్‌ వాటర్‌పై కీలక సమాశం.. ఈనెల 13న సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ భేటీ

అమరావతి, ఆంద్రప్రభ : పోలవరం బ్యాక్‌ వాటర్‌ (వెనక్కి ప్రవహించే జలాలు) సమస్యపై చర్చించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఈనెల 13న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీతో పాటు పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావం, ముంపు అనుమానాలను లేవనెత్తిన తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ)లను కూడా కేంద్ర జలసంఘం ఆహ్వానించింది. పోలవరంపై రీ సర్వే చేయాలని పరీవాహక రాష్ట్రాలు పట్టు-బడుతున్న నేపథ్యంలో టీఏసీ నిర్వహించనున్న సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ముంపు ప్రభావంపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆశ్రయించాయి. అన్ని భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి తుది నివేదిక ఇవ్వాల్సిందిగా సీడబ్ల్యూసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
   

అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గతనెల సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాల నుంచి సీడబ్ల్యూసీ నివేదికలు స్వీకరించింది. వాటిని నిశితంగా పరిశీలించిన అనంతరం ఈనెల 13న మరోసారి సమావేశం నిర్వహించి తుది నివేదికను సిద్ధం చేసి సుప్రీంకోర్టుకు అందచేయనుంది. గతనెలలో నిర్వహించిన సమావేశంలో బ్యాక్‌ వాటర్‌ అనుమానాలను నివృత్తి చేసేందుకు సీడబ్ల్యూసీ ప్రయత్నించింది. పోలవరం వల్ల ఎలాంటి ముంపు ఉండే అవకాశం లేదనీ, దేశంలో ప్రముఖ సంస్థలతో అధ్యయనం చేయించిన అనంతరమే పోలవరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామని సీడబ్ల్యూసీ వివరించింది. అంతేకాకుండా బ్యాక్‌ వాటర్‌ పై రీ సర్వే చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ వివరణతో సంతృప్తి పడని రాష్ట్రాలు రీ సర్వే చేయాల్సిందేనని పట్టు-డుతున్నాయి. పోలవరంలో 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తే భద్రాచలం పట్టణంతో పాటు- సుమారు 100 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ చెబుతోంది.

ఈ మేరకు ఇటీవల వచ్చిన వరద ప్రభావాన్ని సాంకేతికంగా ఉటంకిస్తూ నివేదిక అందించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు తమ రాష్ట్రాల్లోని లోతట్టు గ్రామాలు ముంపునకు గురవుతాయని నివేదికలు అందించాయి. ఒడిశా అయితే తమ రాష్ట్రంలో భూసేకరణకు సహాయ నిరాకరణ చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణాన్ని సృష్టించటం, పోలవరంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు సీడబ్ల్యూసీ ప్రయత్నిస్తోంది.

వచ్చే నెలలో సీఎం సమావేశం

సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) సమావేశం ఈనెల 13న నిర్వహించిన అనంతరం వచ్చే నెలలో ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. ఫిబ్రవరి 27 లోపు సుప్రీంకోర్టుకు పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై తుది నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఈలోపే సమావేశం నిర్వహించి సమగ్ర నివేదిక రూపొందించాలని సీడబ్ల్యూసీ భావిస్తోంది. జాతీయ ప్రాజెక్టయిన పోలవరం నిర్మాణదశలో ఉంది. ఇప్పటికే సుమారు రూ 20 వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. పోలవరం పూర్తయితే కేవలం ఏపీకే కాకుండా పొరుగు రాష్ట్రాల సాగు, తాగునీటి ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. ఈ నేపథ్యంలో కాలయాపన నివారించటం, న్యాయపరమైన చిక్కుముడులు తలెత్తకుండా చూసేందుకు సీడబ్ల్యూసీ ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement