Thursday, April 18, 2024

కక్షసాధింపు అనుకుంటే సీబీఐ దర్యాప్తు జరిపించండి.. వర్ల రామయ్య కేసులో ఏపీ వాదనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి దర్యాప్తు జరిపించే అధికారం లేదా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఉండే ఎగ్జిక్యూటివ్ పవర్ (పాలనాపరమైన అధికారం)తో దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఉన్నప్పుడు రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరిస్తూ దర్యాప్తుపై ‘స్టే’ విధించడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించింది. వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుపై స్టే విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ హైకోర్టు తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

2019 డిసెంబర్లో రాష్ట్ర మంత్రివర్గం ఒక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరిపిందని, ఆ మేరకు అవకతవకలను గుర్తించి లోకాయుక్త, సీబీఐ లేదా సీఐడీ (సిట్)తో దర్యాప్తు జరిపించాల్సిందిగా సిఫార్సు చేసిందని తెలిపారు. కేబినెట్ సబ్-కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తే రాష్ట్ర హైకోర్టు రాజకీయ దురుద్దేశాలు, కక్షసాధింపును ఆపాదిస్తూ దర్యాప్తును నిలుపుదల చేసిందని వెల్లడించారు. దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ‘సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)’ను ఏర్పాటు చేసే అధికారం లేదని హైకోర్టు ఎలా తీర్పునిస్తుందని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలనాధికారాన్ని సవాలు చేయడమేనని సింఘ్వి అన్నారు. రాజకీయ కక్షలు ఉన్నప్పటికీ వాస్తవాలు తెలుసుకోవడం కోసం దర్యాప్తు చేయడం సమంజసమేనని జగన్నాథ్ రావు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

నిజానికి దర్యాప్తు జరిపించడానికి అన్ని అర్హతలు, ప్రాథమిక సమాచారం ఉన్న కేసు అని, అయినా సరే హైకోర్టు ఈ రకంగా తీర్పునివ్వడం సరికాదని, ప్రారంభదశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు. నిజంగానే ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని సీబీఐ దర్యాప్తును సిఫార్సు చేస్తుందా అని ప్రశ్నించారు. పోనీ హైకోర్టుకే అనుమానాలుంటే జరిగిన అవకతవకలపై నేరుగా హైకోర్టే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు కదా అన్నారు. కానీ హైకోర్టు అలా చేయకుండా కేబినెట్ సబ్-కమిటీ సిఫార్సులనే తప్పుబట్టిందని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ కక్షసాధింపు లేదని, హైకోర్టు విధించిన ‘స్టే’ ఎత్తేయాలని సింఘ్వి కోరారు. ఒకవేళ కక్షసాధింపు ఉందని న్యాయస్థానం భావిస్తే ఇప్పటికైనా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చని సూచించారు.

- Advertisement -

అనంతరం ప్రతివాదిగా ఉన్న వర్ల రామయ్య తరఫున వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసిందని తెలిపారు. అవకతవకలను గుర్తిస్తే వాటిపై సీబీఐ దర్యాప్తు జరిపించడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ గంపగుత్తగా గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపైనా దర్యాప్తు జరిపించాలనుకోవడం కచ్చితంగా రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నదే అని వాదించారు. అందుకే తాము ‘సిట్’ను వ్యతిరేకించామని తెలిపారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇది కొత్తగా ఏర్పడే ప్రభుత్వాల అధికారాలకు సంబంధించినదని, దీనిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విస్తృత పర్యవసానాలు ఉన్న ఈ అంశంపై తదుపరి విచారణ ఈనెల 16న చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఆరోజు ప్రాధాన్యతాక్రమంలో ఈ కేసును ముందువరుసలో చేర్చాల్సిందిగా రిజిస్ట్రీకి సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement