Saturday, April 20, 2024

జగన్‌ నచ్చకపోతే తప్పులేదు.. పథకాలు నచ్చలేదంటే పేదల వ్యతిరేకే..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నచ్చకపోతే తప్పులేదని, కానీ ఆయన అమలు చేస్తున్న పథకాలు నచ్చలేదంటే పేదల వ్యతిరేకి అని అర్థమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ అన్నారు. సామాజిక న్యాయభేరి, వైఎస్సార్సీపీ మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వు చేసిందని గుర్తుచేశారు. కాంట్రాక్టు పనుల్లోనూ ఈ విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు. రాజ్యసభలో పార్టీకి మొత్తం 9 మంది ఎంపీలుంటే 5 బీసీలకే ఇచ్చారని వేణుమాధవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 139 కులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, నవరత్నాల పథకాల ద్వారా 54 శాతం ఉన్న బీసీలకు అత్యధికంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని కొనియాడారు.

మరోవైపు దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ప్రైవేటు బిల్లు పెట్టడం చారిత్రాత్మకమని అన్నారు. అలాగే ఏపీ కేబినెట్లో 70 శాతం పదవులను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చారని అన్నారు. పేదవాడికి ఇల్లు కట్టించడమే గొప్ప అనుకునే స్థాయి నుండి పేద ప్రజల కోసం ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కూడా సంక్షేమ ఫలాలు అందుకుంటున్నాయని కర్రి వేణుమాధవ్ తెలిపారు. రాజకీయ వైరంతో ముఖ్యమంత్రి జగన్ నచ్చకపోయినా తప్పులేదని, కానీ ఆయన అమలు చేస్తున్న ఫథకాలను వ్యతిరేకిస్తే కచ్చితంగా పేదల వ్యతిరేకిగా నిలిచిపోతారని వేణుమాధవ్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement