Thursday, April 18, 2024

డబ్బులు దాచుకున్న బ్యాంకు దివాలా తీస్తే.. ఖాతాదారుడి పరిస్థితి ఏంటి?

ఇటీవల అమెరికాకు చెందిన ఎస్‌వీబీ బ్యాంకు దివాలా తీశాక, బ్యాంకులో సొమ్ము ఎంత వరకు భద్రం అనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు బ్యాంకు దివాలా తీస్తే ఖాతాదారుడి డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారు..? వినియోగదారుడు బ్యాంకులో దాచుకున్న డబ్బులపై బీమా రక్షణ ఉంటుంనే విషయాన్ని ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి. ఈ సదుపాయం ఖాతాదారులకు ఉచితమే. దీనికి సంబంధించిన ప్రీమియంను బ్యాంకులే చెల్లించాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో బ్యాంకు మూసేస్తే లేక ఇంకేదైనా జరిగితే ఆ పరిహారం ఖాతాదారులకు అందుతుంది. అయితే ఆ పరిహారం గరిష్టంగా రూ.5 లక్షలు మాత్రమే. అంటే మీరు బ్యాంకులో ఎంత దాచుకున్న మీకు రూ.5 లక్షలే అందుతాయి.

ఒకే బ్యాంకులోని వివిధ శాఖల్లో ఖాతాలు ఉన్నా, వాటిన్నింటికీ కలిపి గరిష్టంగా రూ.5 లక్షల వరకే బీమా ఇస్తారు. ఒకే బ్యాంకులో ఎక్కువ ఖాతాలుంటే వాటిన్నింటినీ ఒకే ఖాతాగా పరిగణిస్తారు. ఈ మొత్తంలో బీమా ప్రాసెస్‌ను డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ చూసుకుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన డీఐసీజీసీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. దేశంలోని అన్ని వాణిజ్య, విదేశీ బ్యాంకుల్లో ఉంచిన డిపాజిటర్ల డబ్బుకు డీఐసీజీసీ బీమా రక్షణ కల్సిస్తుంది. కేంద్ర, రాష్ట్ర పట్టణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు డీఐసీజీసీ బీమా కవర్‌ తీసుకోవాలి.

బ్యాంకుల్లోని పొదుపు, ఫిక్స్‌డ్‌, కరెంట్‌, రికరింగ్‌ డిపాజిట్‌ వంటి అన్ని డిపాజిట్ల పైనా బీమా వర్తిస్తుంది. బీమా పరిమితి రూ.5 లక్షల మాత్రమే కాబట్టి అంతకుమించి బ్యాంకుల్లో మదుపు చేయడం రిస్క్‌ అని ఆర్థిక నిపుణలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఖాతాదారులడు రూ.10 లక్షల మదుపు చేయాలనుకుంటే, అందులో రూ.5 లక్షలు అతని వ్యక్తిగత ఖాతా ద్వారా, మిగిలిన మొత్తాన్ని తన భార్య లేదా పిల్లలు పేరు మీద చెయొచ్చు. అదే విధంగా ఈ సౌకర్యం జాయింట్‌ ఖాతాకు కూడా వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement