Saturday, April 20, 2024

టాటా మెమోరియల్‌ సెంటర్‌కు ఐసీఐసీఐ రూ.1,200 కోట్ల నిధులు

కేన్సర్‌ రోగులకు మరింత వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)కు రూ.1,200 కోట్లు సాయం ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సహా దేశంలోని మూడు ప్రాంతాల్లో టీఎంసీకి చెందిన కేన్సర్‌ ఆసుపత్రుల విస్తరణ నిమిత్తం తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) విభాగం ఈ నిధులను ఇవ్వనున్నట్లు తెలిపింది. విస్తరణలో భాగంగా నవీ ముంబయిలోని ఖర్‌ఘర్‌ వద్ద టీఎంసీకి ఉన్న అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ కేన్సర్‌లో రేడియేషన్‌ ఆంకాలజీ బ్లాక్‌బీ ముల్లాన్‌పుర్‌ (పంజాబ్‌), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌)లోని టీఎంసీ హూమీ బాబా కేన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో రెండు పీడియాట్రిక్‌, హమటాలాజికల్‌ ఆంకాలజీ బ్లాక్‌లు ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

ఈ కొత్త బ్లాక్‌లు 2027 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఛైర్మన్‌ గిరీశ్‌ చంద్ర చతుర్వేది తెలిపారు. వీటిద్వారా ఏటా మరో 25,000 మంది కేన్సర్‌ రోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం టీఎంసీ ఏటా 1.2 లక్షల మందికి కేన్సర్‌ చికిత్స అందిస్తోంది. ఈ మూడు ఆసుపత్రుల విస్తరణ కోసం ఇప్పటికే రూ.500 కోట్ల మేర సీఎస్‌ఆర్‌ నిధి సిద్ధంగా ఉందని, మొత్తం మీద రూ.2,500 కోట్లు వెచ్చిస్తామని చతుర్వేది తెలిపారు. తద్వారా టీఎంసీ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ కార్యకలాపాల కోసం బ్యాంకు తన సీఎస్‌ఆర్‌ నిధుల్లో 50 శాతాన్ని వెచ్చించనుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement