Wednesday, March 27, 2024

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు చార్జీల బాదుడు.. నగదు విత్‌ డ్రా చేసినా.. ఆలస్యంగా బిల్లు చెల్లించినా.. ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి..

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుదారులకు ఆ బ్యాంకు భారీ షాక్‌ ఇచ్చింది. క్రెడిట్‌ కార్డు లావాదేవీలు చేసే ముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. నగదు విత్‌డ్రా, బిల్లు చెల్లింపు వ్యవహారంలో ఇక నుంచి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌ కార్డుతో క్యాష్‌ అడ్వాన్స్‌గా తీసుకున్నా.. (కార్డుతో ఏటీఎం నుంచి డబ్బు తీసినా) లేక లేటుగా బిల్‌ పే చేసినా వినియోగదారులపై భారం పడనుంది. అడ్వాన్స్‌ మొత్తంలో 2.50 శాతం లేదా కనీసం రూ.500 చొప్పున వసూలు చేయనున్నారు. ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే.. బిల్లు మొత్తం రూ.100 లోపు ఉంటే ఎలాంటి చార్జీలు ఉండవు. రూ.100-500 మధ్య ఉంటే రూ.100, రూ.501-5000 మధ్య ఉంటే.. రూ.500 అదనంగా కట్టాల్సి ఉంటుంది. రూ.5001 నుంచి రూ.10,000 వరకు ఉంటే.. రూ.750, రూ.10,001 నుంచి రూ.25వేల మధ్య ఉంటే ఆలస్య రుసుము కింద రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి : డిష్‌ టీవీలో యస్‌ బ్యాంకుకు 25.60 శాతం వాటా

సకాలంలో చెల్లిస్తేనే..
రూ.25,001 నుంచి రూ.50,000 వరకు ఉంటే రూ.1000, రూ.50వేలు పైన ఎంత మొత్తం అయినా.. రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలన్నింటికీ రూ.50 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఎమరాల్డ్‌ క్రెడిట్‌ కార్డుకు ఆలస్యం రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఎలాంటి చార్జీలు ఉండవు. ఆలస్యంగా చెల్లింపులు చేయడం, ఏటీఎం నుంచి డబ్బు విత్‌ డ్రా చేయడం వంటివి చేసే వారికి మాత్రం ఈ చార్జీలు వర్తిస్తాయి. ఈ భారం పడకూడదంటే.. సకాలంలో బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయి. క్రెడిట్‌ కార్డు ఛార్జీల సవరణకు సంబంధించి ఇప్పటికే తన వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంకు సందేశాలు పంపిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement