Tuesday, April 16, 2024

యోగీ అనే నేను.. యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం, ముఖ్య అతిథిగా మోడీ

ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంగా వరుసగా రెండో సారి యోగీ ఆదిత్యనాథ్‌ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో ఈ కార్యక్రమంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కీలక రాజకీయ, సినీ, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. 52 మంత్రులతో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లిd ఎన్నికల్లో ఓడినప్పటికీ.. కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. గత కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్న దినేశ్‌ శర్మకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్‌ నేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. గత కేబినెట్‌లో ఉన్న 20 మంది మంత్రులకు ఈసారి యోగీ తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు.

యోగీకి నితీష్‌ అభినందనలు..

యోగీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా.. స్టేడియం మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. బ్రజేష్‌ పాఠక్‌కు కొత్తగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి నుంచి ముగ్గురు మంత్రులకు ప్రాతినిథ్యం లభించింది. యోగీ మంత్రివర్గంలో మోడీ మార్క్‌ స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ కూడా హాజరయ్యారు. యూపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యోగీకి.. ఆయన అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ పాలన ఎంతో బాగుందన్న నితీష్‌ కుమార్‌.. పథకాల గురించి ప్రస్తావించారు. యోగీ హయాంలో యూపీ మరింత అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. యోగీ ఆదిత్యనాథ్‌ విజయంపై ఇప్పటికే తాను ఫోన్‌లో అభినందనలు తెలియజేసినట్టు వివరించారు. యూపీ ప్రభుత్వానికి ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.

85వేల మంది హాజరు!

యోగీ ప్రభుత్వ కొత్త మంత్రివర్గంలో సూర్యప్రతాప్‌ షాహి, సురేష్‌ కుమార్‌ ఖన్నా, స్వతంత్ర దేవ్‌ సింగ్‌, బేబి రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ్‌ చదరీ, జైవీర్‌ సింగ్‌, ధరంపాల్‌ సింగ్‌, నంద్‌ గోపాల్‌ గుప్తా నంది, భూపేంద్ర సింగ్‌ చదరీ, అనిల్‌ రాజ్‌భర్‌, జితిన్‌ ప్రసాద్‌, రాకేష్‌ సచన్‌, అరవింద్‌ కుమార్‌ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్‌, ఆశిష్‌ పటేల్‌, సంజయ్‌ నిషాద్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతి ఇరానీ, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. సుమారు 85వేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తున్నది. యూపీ రాజకీయ చరిత్రలో ఒక సీఎం అధికారం నిలబెట్టుకుని రెండో సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం.. 37 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల జరిగిన అసెంబ్లిd ఎన్నికల్లో.. పోటీ చేసిన బీజేపీ.. 403 స్థానాల్లోంచి 255 సీట్లను గెలుచుకుంది. 41.29 శాతం ఓట్లను రాబట్టుకుంది. ఎన్‌డీఏ కూటమికి 273 స్థానాలు వచ్చాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement