Thursday, September 23, 2021

సైదాబాద్ అత్యాచార నిందితుడి గుండు ఫోటో విడుదల

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి చైత్ర హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రాజు ఆచూకీకి సంబంధించి సమాచారం ఇచ్చే వారికి రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీసులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా రాష్ట్ర డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు సెల్‌ఫోన్ వాడకపోవడంతో అతడి ఆచూకీ గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. దీంతో సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సైదాబాద్ నిందితుడు, మోస్ట్ వాంటెడ్ రాజుకు సంబంధించి మరిన్ని ఫోటోలు, క్లూస్‌ని హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేశారు. ఆ మేరకు రెండు ట్వీట్స్ చేశారు. ఎవరూ తనను గుర్తించకుండా గుండు చేయించుకుని ఉంటే ఎలా ఉంటాడన్న దానిపై ఓ ఊహా చిత్రాన్ని కూడా పోలీసులు విడుదల చేశారు. అలాగే నిందితుడి చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ రాజును కఠినంగా శిక్షించాలని పలువురు సినీ ప్రముఖలు కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, మంచు మనోజ్, నాని సహా పలువురు నటులు నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News