Saturday, April 20, 2024

లంకలో ఆకలి కేకలు.. ఇంకా చక్కబడని పరిస్థితులు

కొలంబో : హిందూమహాసముద్రంలో ముత్యంలా కన్పించే శ్రీలంక ఇప్పుడు కన్నీటిచుక్కను తలపిస్తోంది. అక్కడి ప్రజల్లో 90 శాతం మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. చేతిలో పనిలేదు. రూపాయి ఆదాయం లేదు. భవిష్యత్‌లో పరిస్థితులు చక్కబడతాయన్న ఆశ లేదు. తీవ్ర నిరాశ నిస్పృహల్లో శ్రీలంక పౌరులు కూరుకుపోయారు. విధిలేక రోడ్డెక్కారు. మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గట్టెక్కించే దారీతెన్నూ తెలీక గొటబాయ రాజపక్స ప్రభుతం కొట్టుమిట్టాడుతోంది. రాజకీయ సంక్షోభాన్ని అధిగమించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ సుమారు రెండు నెలలుగా శ్రీలంకలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. కొనేందుకు నిత్యావసర వస్తువులు లభ్యం కావడంలేదు. అక్కడక్కడ దొరికినా ధరలు అందుబాటులో లేవు. ఇక పెట్రోల్‌, డీజిల్‌ కొరత వేధిస్తోంది. ఈ సమస్య వల్ల ప్రభుత ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జలవిద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా కనీసం రోజులో 12 గంటలపాటు విద్యుత్‌ కోత విధిస్తున్నారు. మార్చి చివరిలో సంక్షోభం మరింత తీవ్రమైనప్పటినుంచి పరిస్థితులు చేజారిపోయాయి.

పెరిగిన అప్పులు.. ధరలు…

గత ఏడాది ఏప్రిల్‌-మే నెలలతో పోలిస్తే ఈ ఏడాది ఆహార పదార్థాల ధరలు 44 శాతం, రవాణా చార్జీలు 68 శాతం పెరిగాయి. ఇక ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా ధరలు పెరిగిపోతున్నాయి. ఈనెల 11వ తేదీనాటికి శ్రీలంక రూపాయి విలువ అమాంతం పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 364.76గా తేలింది. మార్చి 3వ తేదీన అమెరికా డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ 202గా ఉంది. రెండునెలల్లో ఏకంగా దాదాపు 75 శాతం విలువ తగ్గిపోవడం అక్కడి ఆర్థిక పరిస్థితులను అద్దం పడుతుంది. మరోవైపు అప్పులు పెరిగిపోయాయి. 2018నాటికి జీడీపీలో 84.2 శాతం అప్పులుంటే గత ఏడాది జీడీపీని మించి శ్రీలంక అప్పులు చేసింది. 2021లో అప్పులు జీడీపీతో పోలిస్తే 104.6 శాతం మేరకు చేరుకున్నాయి. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయాయి. విదేశీ అప్పులు చెల్లించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. మరోవైపు నిత్యావసరాల కొరత తీవ్రమైంది. బియ్యం, పాల వంటివి దొరకడం దుర్లభమైంది. ప్రస్తుతం కిలో బియ్యం దాదాపు 300 రూపాయలకు చేరుకుంది. గత ఏడాది జనవరితో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ. పాలపొడి 200 గ్రాముల ప్యాకెట్‌ 250 రూపాయలపైమాటే. ఇక పెట్రోల్‌ లీటర్‌ 339 రూపాయలు. గత జనవరితో పోలిస్తే ఇది 90 శాతం అధికం. పోనీ కొందామన్నా దొరకడం లేదు. భారత్‌ వంటి దేశాలు సహాయం చేస్తున్నా అవి జాతీయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. మరికొంత సంపన్నులకు విక్రయిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా నిరుద్యోగం తాండవిస్తోంది. ఇక తలనొప్పి, సాధరణ జ్వరం తగ్గే మందులు కూడా దొరకడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతవల్ల ఆటోలు, అశాంతి పరిస్థితులవల్ల రిక్షాలవంటివి తిరిగే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆదాయం లేక పస్తులు తప్పడం లేదు. ఇప్పటికిప్పుడు పరిస్థితులు మారతాయన్న ఆశలు లేవు. అధ్యక్షుడు, ప్రధాని సహా కీలక మంత్రిత్వశాఖలన్నీ గొటబాయ బంధువర్గం చేతుల్లో ఉండటం, అసమర్థ పాలనవల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్న ఆగ్రహంతో ప్రజలు రోడ్డెక్కారు. శుక్రవారంనాడు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement