Thursday, March 28, 2024

తెలంగాణ‌కు పెట్టుబ‌డుల వ‌ర‌ద

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు క్రేజీ పెరుగుతోంది. రాష్ట్ర ఏర్పాటునుంచీ ఇంతింతై పెరుగుతూ ఇప్పటివరకు 2.6 లక్షషీల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో తెలంగాణలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇదే విషయాన్ని తాజాగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎగుమతుల ప్రోత్సాహక మండలి(ఎంఎస్‌ఎంఈ) నివేదిక వెల్లడించింది. తెలంగాణకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని పారిశ్రామిక విధానం తీరును మరోసారి జాతీయ స్థాయిలో ఎలుగెత్తిచాటింది.

ప్రగతి పథంలో వ్యవసాయ, అనుబంధ రంగాలతోపాటు, ఐటీ రంగం అద్భుతంగా పురోగమిస్తున్నదని తేటతెల్లం చేసింది. ఈ ఏడాది 17.53 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనే కాకుండా పరోక్షంగా మరికొన్ని లక్షల ఉద్యోగాలు తెలంగాణలో సాకారమయ్యాయని ఈ సంస్థే కాకుండా మరికొన్ని ఇతర నివేదికలు ఈ ఆర్ధిక ఏడాది ముగింపు అంశాల్లో భాగంగా వెల్లడిస్తున్నాయి. దేశంలో జాతీయ స్థాయిలో జీడీపీ తగ్గుముకం పడుతున్న తరుణంలో తెలంగాణలో 2.2 శాతం వృద్ధిరేటు సాధ్యమైంది. పెట్టుబడులకు కేరాఫ్‌గా మారిన తెలంగాణలో 2021-22లో 150శాతం వృద్ధి సాకారమవగా, 2020-21లో రూ. 31,274కోట్ల పెట్టుబడులు తెలంగాణకు పరుగులు తీశాయి. 2021-22లో రూ. 76,568కోట్లు పెట్టుబడులు వచ్చి 3.71లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 7లక్షలకు చేరుకుంది. 2014-15లో రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ. 66,276కోట్లుగా ఉండగా, 2021-22నాటికి రూ. 1,45,522కోట్లకు చేరుకున్నది. పారదర్శక విధానాలు సుస్థిర ప్రగతి, విధానాల అమలులో వేగం, పాలనలో మరింత వేగం వంటివి పెట్టుబడులకు ఊతంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. రోజుకో రికార్డును సొంతం చేసుకుంటున్న రాష్ట్రం మరో రికార్డుకు చేరువవుతోంది. పెట్టుబడుల సాధన, పరిశ్రమల వ్యవస్థాపన, ఉపాధి కల్పనలో జెట్‌ వేగంతో దూసుకుపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఏక గవాక్ష అనుమతులతో సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది.


అన్ని జిల్లాల్లో ప్రగతి దిశగా…
ప్రభుత్వ అంచనాలు నిజమవుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానంద్వారా అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మొదలుకొని ఖమ్మం, ఆదిలాబాద్‌ వరకు ఎక్కడా ఆగకుండా ఐటీ రంగం పరుగులు పెడుతోంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీకి ఆదరణ పెరుగుతోంది. ఐటీ టవర్ల ఏర్పాటు, అంకుర పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అండగా నిలుస్తోంది. పారిశ్రామిక వికేంద్రీకరణ ఫలాలు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పెట్టుబడుల సాధనలో రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక రంగంలో తనకున్న హవాను ఈ జిల్లా కాపాడుకుంది.

పూర్తి భిన్నం…సరళం…
గతంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా ఎంతో శ్రమ ఉండేది. దాదాపు 33 శాఖలనుంచి అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఇది వ్యయంతోపాటు, కాలయాపనకు కారణంగా భావించి అనేకమంది పెట్టుబడి దారులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లేవారు, జాప్యం, అవినీతి పారిశ్రామిక రంగానికి అడ్డుగా ఉండేదని ఆరోపణలు ఉండేవి. వీటన్నింటినీ రూపు మాపుతూ… పారదర్శకతకు చిహ్నంగా టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పారిశ్రామిక వర్గాల స్వీయ దృవీకరణతో అన్ని శాఖల అనుమతులను సింగిల్‌విండో విధానంలో ఒకే దగ్గర అందించే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.

మరోవైపు గతంలో ఉన్న పారిశ్రామిక పవర్‌ హాలిడేలకు తెలంగాణ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఇది పారిశ్రామిక వర్గాలకు ఎంతో ఊరటనివ్వడంతోపాటు ఉత్పాదకత, లాభాల పెంపునకు మార్గంగా నిల్చింది. నిరంతరాయ విద్యుత్‌, ఇతర ప్రోత్సాహకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐటీ సెక్టార్‌కు ఇవ్వని రీతిలో తెలంగాణలో అందుతున్నాయని నివేదికలో ముక్తాయించాయి. ఇవన్నీ కలగలిపి రాష్ట్ర సంపద, జీఎస్డీపీలో మరింత అతిపెద్ద వాటాకు దిక్కుగా మారినట్లు అభివర్ణించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement