Wednesday, April 24, 2024

మృగశిర కార్తె సందర్భంగా భారీగా పెరిగిన చేపల ధరలు

మృగశిర కార్తె వచ్చిందంటే సకల జనులకు ఊరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిర కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రజల్లో, రైతాంగంలో విశేష ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.అప్పటివరకు నిప్పులు చెలరేగిన భా నుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్ల బడుతాయి. దీంతో తొలకరి జల్లులు పడగానే రైతులు దుక్కులు దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. దీనిని ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు.

నేటి నుంచి కార్తె మొదలు
మృగశిర కార్తె మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్తె ప్రవేశం రోజు చేపలు తినడం అనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నా.. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి.. ముంగిళ్లు చల్లబరిచే మృగశిర మొదలవనున్నది. ఈ కార్తెలో చల్లదనాన్ని తట్టుకునేందుకు శరీరంలో వేడి ఉండేందుకు ఎక్కువగా నాటుకోళ్లు, గుడ్లు, చికెన్, చేపలు, మటన్‌ అ«త్యధికంగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఇంగువ, బెల్లం ఉండలను కూడా మింగుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మృగశిరను వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రైతులు సాగు పనులు ప్రారంభించడానికి అధిక ప్రా«ధాన్యత ఇస్తారు. కార్తె రోజున పంటలను ప్రారంభిస్తే పంటలకు ఈగ, దోమ పోటు పడదని రైతులు భావిస్తారు.

చేపలు తినడం ఆనవాయితీ..
మృగశిర ప్రారంభం రోజు చేపలను తినడం ప్రజలు ఆచారంగా భా«విస్తారు. దీంతో మామూలు రోజుల కంటే ఈ రోజున చేపలు ఎక్కువగా అమ్ముతుండడంతో అధికంగా గిరాకీ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు అదే స్థాయిలో వాటిని వివిధ ప్రాంతాల్లో చెరువుల నుంచి తీసుకొస్తారు. మృగశిర కార్తెకు ఒక్క రోజు ముందుగానే అంటే సోమవారం కొర్రమేను చేప రూ.550 నుంచి రూ.600కిలో అమ్మారు. మామూలు రోజులు అయితే రూ.450కి అమ్ముతారు. ఈ ధర మృగశిర కార్తెరోజు ( మంగళవారం) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక మిగతా చేపలు కిలోకు రూ.200 నుంచి రూ.350 వరకు పలుకుతుంది. మార్కెట్‌లో చేపలు ఒక్కోక రకాన్ని ఒక్కో ధరకు అమ్ముతున్నారు. చేపల దారిలోనే చికెన్, మటన్‌ ధరలు ఉన్నాయి.

చేపల్లో పోషక విలువలు
చేపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నిషియం, జింక్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్‌ వంటి అమైనో అమ్లాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు తినడం ద్వారా కంటి చూపుని మెరుగు పరుచుకోవచ్చునని చెబుతున్నారు. జ్ఞాపకశక్తి మెరుగు అవుతుందని, మృగశిర కార్తె రోజు చేపలు తినడంతో ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. చేపలు ఎక్కువగా తినడంతో గుండె సమస్యలు ఉన్న వారికి మంచిదని వైద్యులు సైతం పేర్కొంటున్నారు. ఇక గర్భిణులు, పిల్లల తల్లులు వీటిని తినడంతో పాలవృద్ధితో పాటు వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, నాడీ వ్యవస్థ మంచి పనిచేస్తోందని పలువురు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement