Friday, March 29, 2024

ఇంకా ఎంతకాలం? వివేకా హత్యకేసు దర్యాప్తు జాప్యంపై సీబీఐపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యకేసు విచారణలో జాప్యంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు చీవాట్లు పెట్టింది. ఈ కేసులో నిందితుడు (ఏ5)గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య దేవిరెడ్డి తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్‌ను మార్చాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం గత విచారణ సందర్భంగా హత్యకేసు స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్లో సమర్పించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. నివేదికను పూర్తిగా చదివామని చెప్పిన ధర్మాసనం.. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ ప్రారంభమవడంతోనే జస్టిస్ ఎం.ఆర్ షా సీబీఐ తరఫు న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ 15 నెలల క్రితం కేసు ఏ స్థితిలో ఇప్పటికీ అలాగే ఉందని అన్నారు.

నివేదికలో ఎక్కడ చూసినా ‘రాజకీయ వైరం’ హత్యకు కారణమంటూ చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పారు తప్ప హత్య వెనుక జరిగిన విస్తృతస్థాయి కుట్రను బయటపెట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. నిందితుడు దస్తగిరి వాంగ్మూలం మినహా, హత్య చేయడానికి గల కారణాలు, ఉద్దేశాలను నిరూపించడానికి, కొత్త అనుమానితులను దోషులుగా నిర్థారించడానికి ఇతర సాక్ష్యాలేవీ లేవని అన్నారు. కేసులో మెరిట్స్ గురించి తాను మాట్లాడదల్చుకోలేదని, అయితే ఇది బెయిల్ ఇవ్వడానికి సైతం కుదరనంత తీవ్రమైన నేరమని, కానీ ఈ తరహా దర్యాప్తుతో నిందితులకు శిక్షలు వేయలేమని జస్టిస్ ఎం.ఆర్. షా వ్యాఖ్యానించారు. సప్లిమెంటరీ చార్జిషీట్ తర్వాత కేసులో పురోగతి ఏమీ కనిపించలేదని, దర్యాప్తు తీరు ఇలా ఉంటే విచారణ ముగించడానికి ఇంకా ఎన్ని సంవత్సారులు పడుతుంది అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

- Advertisement -

వెంటనే దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐ తరఫు న్యాయవాదులతో అన్నారు. దర్యాప్తు అధికారి విచారణను ముగించే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపించడం లేదని అన్నారు. సీబీఐ డైరక్టర్‌ నుంచి ఆదేశాలు తీసుకుని దర్యాప్తు అధికారిని మార్చాలని, లేదంటే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీబీఐ తరఫు న్యాయవాదులు దర్యాప్తు అధికారి కేసు విచారణ ముగించేందుకు శ్రమిస్తున్నారని, కేసు కీలక దశలో ఉందని చెప్పారు. అలాగైతే ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నిస్తూ.. మరో దర్యాప్తు అధికారిని నియమించాలని, ప్రస్తుత దర్యాప్తు అధికారిని కూడా కొనసాగించాలని జస్టిస్ ఎం.ఆర్. షా సూచించారు. ఏ విషయం రెండ్రోజుల్లో చెప్పాలని (ఈనెల 29 నాడు) ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement