Saturday, March 23, 2024

ఆశాజనకంగా భూగర్భ జలాలు.. 6 మీటర్లలో నే నీళ్ళు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో భూగర్భ జలాలు ఆశాజనకమైన రీతిలో అందుబాటులోకి వచ్చాయి. మే 31 తో ముగిసిన 2022-23 నీటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 6.13 మీటర్లలో భూ గర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. 2022-23 ఖరీఫ్‌, రబీ సాగుతో పాటు వేసవికాలంలో తాగునీరు, గృహ అవసరాలకు 913.35 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులోకి రాగా అందులో 263.13 టీఎంసీలు మాత్రం వినియోగమయ్యాయి. దీంతో జూన్‌ 1 నుంచి ప్రారంభమైన కొత్త నీటి సంవత్సరంలో భూగర్భ జలాలు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ ఉండటంతో నీటి కొరత ఏర్పడే సమస్యే ఉత్పన్నం కాకపోవచ్చని భావిస్తున్నారు.

సహజంగా వర్షాకాలంలో భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది.. దీనికి తోడు మిగులు జలాలు కూడా ఉండటంతో బోర్ల కింద ఖరీఫ్‌ సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. 2022-23 నీటి సంవత్సరంలో సగటున 1046.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావటంతో భూగర్భ జలాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో సగటు భూగర్భ నీటి మట్టం 8.67 మీటర్లు కాగా బాపట్ల జిల్లాలో కనిష్టంగా 3.59 మీటర్లలో నీటి లభ్యత ఏర్పడింది. ఏలూరు జిల్లాలో గరిష్టంగా 20.95 మీటర్ల లోతుకు వెళితే తప్ప భూగర్భ జలాలు అందుబాటులోకి రాలేదు. నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 0.37 మీటర్ల వరకే భూ గర్భ జలాలను వినియోగించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3.95 మీటర్ల వరకు నీటిని తోడేశారు. రాయలసీమలో రబీ సీజన్‌ కోసం భూ గర్భ జలాలు అందుబాటులోకి రావటం సాగుకు బాగా కలిసి వచ్చింది.

రాష్ట్రంలో సుమారు 15 లక్షల బోరుబావులను భూ గర్భ జలవనరుల శాఖ గుర్తించి జియో ట్యాగింగ్‌ చేయగా సుమారో మరో లక్ష బోరు బావులుంటాయని అంచనా. మొత్తం 16 లక్షల బోరు బావుల ద్వారా భూ గర్భ జలాలు 2022-23 నీటి సంవత్సరంలో ఖరీఫ్‌, రబీ సాగుకు ఉపయోగపడ్డట్టు- అంచనా. అనంతపురం జిల్లాలో 2.79 మీటర్ల వరకూ, శ్రీ సత్యసాయి జిల్లాలో 2.54 మీటర్ల వరకు భూ గర్భ జలాలను వినియోగించుకున్నారు. ఈ ఏడాది ఉమ్మడి గోదావరి జిల్లాల కన్నా కరువు ప్రాంతమైన రాయలసీమలోనే భూగర్భజలాల లభ్యత బాగా పెరిగింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 8.35 మీటర్లలో, అనంతపురం జిల్లాలో 7.84 మీటర్లలోనే భూ గర్భ జలాలు అందుబాటు-లోకి వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement