Wednesday, April 17, 2024

తెలంగాణ విమోచన దినోత్సవం: సెప్టెంబర్ 17 చరిత్ర ఇది..

సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్‌ స్టేట్‌ భారతదేశంలో కలిసిన రోజు అది. తెలంగాణ సాయుధపోరాటాల గురించి నేటితరం వారికి అంతగా తెలియకపోవచ్చు గానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలన గురించి, రజాకర్ల ఆకృత్యాల గురించి, వాటిని ఎదుర్కొవడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి వెనుకటితరం వారు నేటికీ ఆనాడు తాము అనుభవించిన కష్టాలు మరిచిపోలేమని చెపుతుంటారు. ఆనాడు తమ కళ్ళ ముందు జరిగిన దారుణ మారణకాండ, అత్యాచారాలు, అకృత్యాలు జ్ఞాపకం వస్తే బాధతో కళ్ళ నీళ్ళు పెట్టుకొంటుంటారు. 

1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. కానీ హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్.. తమది స్వతంత్ర రాజ్యమని, హైదరాబాద్ అటు భారత్ లో, ఇటు పాకిస్థాన్ లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోనివిధంగా ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్లు అప్పటికే నిజాం నవాబు తరపున తెలంగాణపై పడి చాలా భయానక వాతావరణం సృష్టించారు. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. వారి చేతిలో వేలాది మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఈ దారుణమైన పరిస్థితులని తట్టుకోలేక తెలంగాణ యువకులు, కమ్యూనిష్టులు రజాకార్లపై సాయుధ పోరాటాలు మొదలుపెట్టారు. కానీ రజాకార్లని నిలువరించడం వారి వల్ల కాలేదు. బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా చాలా రోజుల పాటు రజాకార్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ తమ తమ మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్ అలీఖాన్ నిషేధించాడు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోవడం తప్పదని అప్పటి హోంమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్థాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.

నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకొందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకొన్నారు. కానీ సైనికచర్య ద్వారా వెంటనే నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని భారత్ లో విలీనం చేసి రజాకర్లని అరికట్టడం అత్యవసరం అని ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ పట్టుబట్టి నెహ్రూని ఒప్పించారు. భారత ప్రభుత్వం తమపైకి యుద్దానికి సిద్దం అవుతోందని తెలిసిన నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు తాము కూడా సిద్దమేనని ప్రకటించడంతో భారత-నిజాం సేనల మద్య యుద్ధం అనివార్యం అయ్యింది. 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్’ అనే పేరు పెట్టారు.  సెప్టెంబర్ 13, 1948న వారి మద్య మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద భీకరయుద్ధం జరిగింది. కానీ దానిని భారత ప్రభుత్వం యుద్ధంగా భావించనందున సైనిక చర్యగానే పేర్కొంది. ఆపరేషన్ పోలో పేరిట సాగిన ఆ సైనిక చర్య కేవలం 5 రోజుల్లోనే ముగిసిపోయింది. భారతసేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. తన సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి అంగీకరించారు.  సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సంస్థానంలో ఉన్న ఔరంగాబాద్, నాందేడ్, పర్బనీ, బీడ్ మహారాష్ట్రాలో , గుల్బర్గా, బీదర్, ఉస్మానాబాద్, రాయచూర్ కర్నాటక రాష్ట్రంలో విలీనం అయిపోయాయి. హైదరాబాద్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అందుకే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.

ఆ తరువాత దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగి మార్చి 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రజాస్వామ్య విధానంలోనే పాలన మొదలైంది. 1956లో హైదరాబాద్ ఆంధ్రాలో కలిసిపోయింది. 2014, జూన్ 2న మళ్ళీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో హైద్రాబాద్‌ స్టేట్‌ విలీనం జరిగింది గనుక, బీజేపీ పటేల్‌కి గుర్తింపుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17ని గుర్తించాలంటోంది. ఇక, మజ్లిస్‌ ఒత్తిళ్ళు, మైనార్టీల మనోభావాల్ని పరిగణనలోకి తీసుకుని, ఎటూ తేల్చుకోలేకపోతోంది తెలంగాణ సర్కార్‌. 

- Advertisement -

అయితే, ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నేతలు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వాల్ని అస్థిర పరిచేందుకు, తద్వారా తెలంగాణ డిమాండ్‌ని గట్టిగా విన్పించేందుకు టీఆర్‌ఎస్‌ అత్యంత కీలకమైన సెప్టెంబర్‌ 17వ తేదీని తనకు కావాల్సిన విధంగా వాడేసుకుని, ఇప్పుడు మాత్రం గాలికొదిలేసిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ ఏడేళ్లు పూర్తి అవుతున్నా..నేటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి. మరి ఈసారైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement