Tuesday, December 3, 2024

TG | రాష్ట్రంలో భారీ వర్షాలు.. అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్‌ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఆదిలాబాద్‌, జనగాం, భూపాలపల్లి, ఖమ్మంతో పాటు మహబూబాబాద్‌, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాలతో పాటు భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఆదివారం, సోమవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు…

రాబోయే రెండు రోజులు సైతం హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు రోజులు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. హైదరాబాద్‌, నగరం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

హైదరాబాద్‌ సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, మున్సిపల్‌ అధికారులను సిద్ధం చేశారు. వర్షం కారణంగా నీరు రోడ్లపై నిలవకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

- Advertisement -

కాగా… (శుక్రవారం) రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్‌ జలయమం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గన్‌ఫౌండ్రీలో 68.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో 67.0, బేగంబజార్‌లో 62.8, నాచారంలో 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి.

దీంతో వాహనాదారులు రాకపోకలకు చాలా ఇబ్బంది పడ్డారు. భారీగా వరదలు రావడంతో ప్రజలకు చాలా ఇబ్బందులకు గురయ్యారు. నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలంలోనూ శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి బడా భీంగల్‌ గ్రామంలో రోడ్డుపై ఆర పెట్టిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. భీంగల్‌కు వెళ్లేదారిలో చెట్టు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement