Tuesday, April 23, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒకటి, రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. దేశంలోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రావడంతో ఆ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని తెలిపింది. అండోమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతున్నాయని పేర్కొంది. అండోమాన్‌ దీవులకు పూర్తిగా రుతువపనాలు విస్తరించాయి.

దీంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న నాలుగైదు రోజుల్లో అండోమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రానున్న 24 గంటల్లో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో అండోమాన్‌ నికోబార్‌ దీవులు సహా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలకు, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవులు మొత్తానికి బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. లక్షద్వీప్‌లో రెండు రోజులపాటు వానలు జోరుగా కురుస్తాయని బుధవారం కర్నాటకలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement