Saturday, April 20, 2024

100 కోట్ల మందికి వినికిడి ముప్పు.. హెడ్‌ఫోన్లు, లౌడ్‌స్పీకర్ల ప్రభావం..

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100కోట్ల మంది యువకులు వినికిడి ప్రమాదానికి దగ్గరగా ఉన్నారని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. హెడ్‌ఫోన్‌లు వినడం లేదా లౌడ్‌స్పీకర్లున్న సంగీత కచేరీలకు వెళ్లడం వంటి పరిణామాలతో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ఈ అధ్యయనం యువకులు తమ శ్రవణ అలవాట్ల గురించి మరింత జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. భవిష్యత్తులో వినికిడి ముప్పు నుంచి యువతను రక్షించడానికి ప్రభుత్వాలు, తయారీదారులు మరింత కృషి చేయాలని కోరింది. డబ్ల్యుహెచ్‌ఒ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురించబడిన విశ్లేషణ గత రెండు దశాబ్దాలుగా ఇంగ్లీష్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌ భాషలలో ప్రచురించబడిన 33 అధ్యయనాల నుండి 12-34 సంవత్సరాల మధ్య వయస్సు గల 19,000 మంది డేటాను పరిశీలించింది.

హెడ్‌ఫోన్లతోనే ఎక్కువ ప్రమాదం..

స్మార్ట్‌ఫోన్‌ల వంటి పరికరాలతో హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు 24 శాతం మంది యువకులు అసురక్షిత శ్రవణ పద్ధతులను కలిగి ఉన్నారని తేలింది. 48 శాతం మంది కచేరీలు లేదా నైట్‌క్లబ్‌లు వంటి వినోద వేదికలలో అసురక్షిత శబ్ద స్థాయిలకు గురైనట్లు కనుగొనబడింది. దాదాపు 1.35 బిలియన్ల మంది యువ కులు వినికిడి లోపంతో బాధపడే ప్రమాదం ఉందని సౌత్‌ కరోలినా వైద్య విశ్వ విద్యాలయంలోని ఆడియాలజిస్ట్‌ లారెన్‌ డిల్లార్డ్‌ చెప్పారు. హెడ్‌ఫోన్‌ల నుండి వినికిడి లోపం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి వాల్యూమ్‌ను తగ్గించడం, తక్కువ సమయం వినడం మాత్రమే పరిష్కారమని చెప్పారు. 60 ఏళ్ల పైబడిన తర్వాత ఇది తీవ్రమైన సమస్యగా మారుతుందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement