Friday, April 19, 2024

యోగాతో ఆరోగ్యం – ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

అనంతపురం : ఆరోగ్యమే మహాభాగ్యమని, యోగాతో ఆరోగ్యయోగం లభిస్తుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. నగరంలోని 33వ డివిజన్‌ నాయక్‌నగర్‌లో ఉన్న 49వ సచివాలయ ప్రాంగణంలో కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ తరగతులను ఎమ్మెల్యే అనంత ప్రారంభించి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా లేకపోతే ఎంత సంపద ఉన్నా ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకంగా ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. యోగా వల్ల ఉల్లాసంతో పాటు మానసిక స్థిరత్వం, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పారు. యోగాను మించిన ఆరోగ్య సాధనం ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ దీన్ని అలవర్చుకోవాలని సూచించారు.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, రాత్రి పూట త్వరగా నిద్రించడంతో పాటు టీవీ, సెల్‌ఫోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. కోవిడ్‌ మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చేసిందని, ఆరోగ్యంపై అందరూ శ్రద్ధ పెట్టేలా కొత్త దారి చూపిందన్నారు. ఇలాంటి తరుణంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం సంతోషంగా ఉందని కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ను అభినందించారు. నగరంలోని అన్ని డివిజన్ల పరిధిలో యోగా తరగతులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు యోగాను ఒక దినచర్యగా భావించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నారు. అనంతరం యోగా శిక్షకురాలు లక్ష్మిదేవికి పలు సూచనలు చేశారు. యోగాసనాలు వేసిన రెండో తరగతి విద్యార్థిని శ్రీనిధిని అభినందించారు. ప్రజలు యోగాపై ఆసక్తి పెంచుకునేలా అవగాహన కల్పించాలని, ఒకవేళ ఇక్కడికి రాలేకపోయినా ఇంట్లోనే ఆసనాలు వేసుకునేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement