Thursday, April 25, 2024

సింగరేణిలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?.. ప్రైవేటీకరణ అంటూ తప్పుడు ఆరోపణలు దేనికి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కే. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యాక సింగరేణిలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ప్రశ్నించారు. కొత్తగా ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలే ఏకంగా 20 వేల వరకు తగ్గాయని ఆయన ఆరోపించారు. మంగళవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదంటూ స్వయంగా ప్రధాన మంత్రే చెప్పారని గుర్తుచేశారు. సింగరేణి కాలరీస్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటాయే 51 శాతం ఉందని, మేజర్ వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండగా ప్రైవేటీకరణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అబద్ధాల పునాదులపై రాజకీయ పబ్బం గడుపుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ అంటేనే అబద్ధానికి మారుపేరుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా గొర్రె కాపరులకు నగదు బదిలీ చేస్తానని హామీ ఇచ్చి, ఎన్నికల సమయంలో డబ్బులు వేసి ఫ్రీజ్ చేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ మాటమార్చి నగదు కాదు గొర్రెలు ఇస్తానంటూ వేలాది కుటుంబాలను కేసీఆర్ దగా చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు గొర్రెల పంపిణీ జరగలేదని అన్నారు. కులవృత్తులపై ఆధారపడ్డవారిని కేసీఆర్ మోసగించడంతో పాటు అవమానిస్తున్నారని మండిపడ్డారు. చేనేతపై జీఎస్టీ అంటూ ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. చేనేతపై రాష్ట్ర పన్నుల శాతాన్ని ఎందుకు తగ్గించడంలో లేదో చెప్పాలని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కారణంగా 6 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని, అలాంటి ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసే కార్యక్రమానికి ప్రధాన మంత్రి వస్తే కేసీఆర్ ముఖం చాటేశారని వ్యాఖ్యానించారు.

- Advertisement -

తెలంగాణ నేతలను అధిష్టానం పిలవలేదు
భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి తెలంగాణ నేతలకు పిలుపు వచ్చిందన్న వార్తలను ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. అధిష్టానం పార్టీ సంస్థాగత కార్యక్రమాలతో బిజీగా ఉందని, పార్టీకి సంబంధించిన వివిధ అనుబంధ సంఘాలతో రెండ్రోజులుగా సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ నేతలకు ప్రత్యేకంగా అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు లేదని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అధిష్టానం ఢిల్లీకి రావాల్సిందిగా పిలిపించిందన్న వార్తలపై ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. పార్టీ అధిష్టానం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉందని, ఈ రెండు చోట్ల ఉన్న తెలుగు సమాజం కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

కృష్ణ మృతిపై సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆయన మృతి తెలుగు సినిమాకు తీరనిలోటని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు సినిమా అంటే కృష్ణ గుర్తుకొస్తారని, మూడు తరాల నటుడిగా ఆయన చిత్రసీమకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ విషాద సమయంలో కృష్ణ కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని, అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు లక్ష్మణ్ ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement