Thursday, April 25, 2024

జేఎన్​యూ గోడలపై విద్వేషపు రాతలు.. విచారణకు ఆదేశించిన వైస్‌చాన్స్‌ల‌ర్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఒకటైన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరో వివాదం రాజుకుంది. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ భవనంలోని గోడలపై బ్రాహ్మణ, వైశ్య సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని రాసిన రాతలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ రాతలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సహా పలు విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ఈ రాతలపై సమగ్ర విచారణకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శాంతిశ్రీ డి. పండిట్ ఆదేశించారు. దశాబ్దాలుగా దేశానికి ఎంతో మంది విద్యావంతులు, శాస్త్రవేత్తలు, బ్యూరోక్రాట్లతో పాటు రాజకీయ నాయకులను అందించిన ఈ విశ్వ విద్యాలయం ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

వివిధ సిద్ధాంతాలు, భావజాలాల సంఘర్షణ జరిగే చోట రాజకీయ రాద్ధాంతం మళ్లీ మొదలైంది. ఈ రాతలు రాసింది తాము కాదు, ఎదుటి పక్షం అంటూ విద్యార్థి సంఘాలు పరస్పరం నిందించుకుంటున్నారు. గోడలపై ప్రత్యక్షమైన రాతల్లో “బ్రాహ్మణులారా.. ఈ క్యాంపస్‌ను విడిచిపొండి”, ‘‘రక్తపాతం జరగబోతోంది’’, ‘‘బ్రాహ్మణులారా, భారత్‌ను విడిచిపొండి’’, ‘‘బ్రాహ్మణులారా, వైశ్యులారా, మేం మీ కోసం వస్తున్నాం. ప్రతీకారం తీర్చుకుంటాం’’ అంటూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో గ్రాఫిటీ రూపంలో గోడలపై ఈ రాతలు ప్రత్యక్షమయ్యాయి. గతంలో పౌరసత్వ చట్ట (సవరణ) బిల్లు తీసుకొచ్చినప్పుడు, కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఈ యూనివర్సిటీ క్యాంపస్ రణరంగంగా మారింది.

సైద్ధాంతిక విబేధాలతో విద్యార్థి సంఘాల మధ్య మాటలు, రాతలను దాటి పరస్పర దాడులు చేసుకున్నారు. వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ ఒకవైపు, జాతీయవాద భావజాలంతో లెఫ్ట్ గ్రూపులను వ్యతిరేకించే బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ మరోవైపు తరచుగా ఘర్షణ పడుతుండేవి. దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని నినందించిన విద్యార్థి సంఘాలను, ఆ భావజాలం కల్గినవారిని తుక్‌డే-తుక్‌డే గ్యాంగ్ అంటూ సంబోధించేవారు. ఇప్పుడు జీ-20కి నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట పెంచుతుంటూ చూసి ఓర్వలేని విద్యార్థి సంఘాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఏబీవీపీ ఆరోపిస్తోంది. గతంలోనూ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలంటూ నినదించిన విద్యార్థి సంఘాలే ఇప్పుడు ఇలాంటి రాతల ద్వారా కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడుతోంది.

- Advertisement -

మరికొందరు విద్యార్థులైతే ఇలాంటి చర్యల కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాతలు ప్రత్యక్షమైనప్పటి నుంచి అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లు చేసి తమ పిల్లల యోగక్షేమాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నిజానికి గత రెండున్నరేళ్లుగా ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితుల్లో కొత్తగా ఈ చిచ్చు రేపుతున్నారని మండిపడుతున్నారు.

వ్యతిరేకించేది భావజాలాన్నే.. కులాన్ని కాదు
ఏబీవీపీ ఆరోపణలను లెఫ్ట్ విద్యార్థి సంఘాలు తోసిపుచ్చాయి. ఈ రాతలు తమ పని కాదని, తాము వ్యతిరేకించేది బ్రాహ్మణవాదాన్ని తప్ప ఆ సామాజికవర్గాన్ని కాదని చెబుతున్నాయి. సైద్ధాంతికంగానే వ్యతిరేకిస్తాం తప్ప వ్యక్తులపై, లేదా ఒక కులంపై వ్యతిరేకత ఎప్పుడూ ప్రదర్శించలేదని అంటున్నాయి. ఒకవేళ అలాంటి ప్రకటన ఏదైనా చేయాలనుకున్నా నిర్భయంగా మీడియా ముందుకొచ్చి మరీ ప్రకటిస్తామని, ఇలా గోడలపై పిచ్చిరాతలు రాయమని ఆయా విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు.

ఈ తరహా ప్రయత్నం ఒకవేళ తమలో ఎవరైనా చేసినా సరే ఖండిస్తాం తప్ప సమర్థించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. రెండ్రోజుల్లో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, గుజరాత్ అసెంబ్లీ 2వ దశ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణ, వైశ్య ఓటుబ్యాంకును బీజేపీ నుంచి దూరం కాకుండా చేసేందుకు ఏబీవీపీనే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా యూనివర్సిటీ గోడలపై రాతలు సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement