Sunday, October 13, 2024

Delhi | సుప్రీంకోర్టుకు గూడెం మహిపాల్ రెడ్డి కేసు.. హైకోర్టు ‘స్టే’ రద్దు కోరుతూ పిటిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పటాన్‌చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి కోర్టు విధించిన శిక్షపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాది మహిపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2014లో పటాన్‌చెరు సమీపంలో ఓ కంపెనీపై జరిగిన దాడి ఘటనలో మహిపాల్ రెడ్డిని సంగారెడ్డి కోర్టు దోషిగా తేల్చి, రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ. 2,500 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహిపాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ట్రయల్ కోర్టు తీర్పుపై ‘స్టే’ ఇచ్చింది.

హైకోర్టు ‘స్టే’ ఇవ్వకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మహిపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి వచ్చేది. అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే సంగారెడ్డి కోర్టు శిక్ష విధించిందని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ‘స్టే’ ఇవ్వడం తగదని పేర్కొంటూ న్యాయవాది మోఖీం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్, ప్రతివాదికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీని మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement