Thursday, April 18, 2024

జూన్‌ 5 నుంచి 12 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ రిలీజ్ చేసిన టీఎస్‌పీఎస్‌సీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీల షెడ్యూల్‌ కోసం ఎంతగానో ఎదురుచూసిన అభ్యర్థులకు టీఎస్‌పీఎస్‌సీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పరీక్ష తేదీలను మంగళవారం ప్రకటించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయని ప్రకటించింది. మొత్తం ఏడు పరీక్షల తేదీలను వెల్లడించింది. ఇంటర్వ్యూలను సైతం తొలగించడంతో ప్రతిభ ఆధారంగానే గ్రూప్‌-1 మెయిన్స్‌ ద్వారా నియామకాలు ఖరారు కానున్న విషయం తెలిసిందే. జూన్‌ 5న జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్ష, 6న పేపర్‌-1 జనరల్‌ ఎస్సే, 7న పేపర్‌-2 హిస్టరీ, కల్చర్‌, జాగ్రఫీ, 8న పేపర్‌-3 భారత సమాజం, రాజ్యాంగం, పాలన, 9న ఎకానమీ, డెవలప్‌మెంట్‌, 10న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌ ఉన్నాయి. 11వ తేదీ ఆదివారం కావడంతో ఆరోజు పరీక్ష ఉండదని తెలిపింది. 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావిర్భావం పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన పరీక్షలు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో నిర్వహింనున్నారు. అయితే పరీక్ష పూర్తిగా ఒకే భాషలో రాయాలని కమిషన్‌ సూచించింది. అన్ని పరీక్షలను అభ్యర్థులు రాయాలని, ఒక్క పేపర్‌ రాయకపోయినా ఉద్యోగ నియామకానికి అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. పరీక్షా విధానాన్ని ఇప్పటికే కమిషన్‌ ప్రకటించింది. 7 పేపర్లు, మూడు గంటల సమయం, 150 మార్కులతో ఉంటాయి. ఇంగ్లీషు పేపర్‌ కేవలం అర్హత పరీక్షగా మాత్రమే ఉంటుంది.

- Advertisement -


503 పోస్టుల కోసం 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా అక్టోబర్‌ 16న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మల్టిdజోన్‌, రిజర్వేషన్‌ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేశారు. ప్రిలిమ్స్‌లో 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చెెసిన విషయం తెలిసిందే. సమాన మార్కులు వచ్చిన వారిలో తెలంగాణ స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఇప్పటికే కమిషన్‌ తెలిపింది. మహిళలకు వర్టికల్‌ విధానంలో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానాన్ని అనుసరించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement