Thursday, October 10, 2024

Greetings – రాష్ట్ర ప్ర‌జ‌లంతా సల్లంగా ఉండాలే – కెసిఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు …

మ‌న సంస్కృతి చాలా గొప్ప‌ది
త‌ర‌త‌రాలుగా మ‌హిళా శ‌క్తి, ఐక్య‌త‌ను చాటుతున్నాం
తెలంగాణ సాధ‌న‌లో సాంస్కృతిక ఉద్య‌మం చేప‌ట్టాం
రాష్ట్ర ప్ర‌జ‌లంతా సల్లంగా ఉండాలే
ఆడ‌బిడ్డ‌ల‌కు కేసీఆర్ బ‌తుక‌మ్మ‌ శుభాకాంక్ష‌లు
ప్ర‌కృతిని ఆరాధించే ఏకైక పండుగ ఇదే..
ఇక్క‌డి సంస్కృతి, అస్తిత్వానికి చిహ్నం
ఎంగిలిపూల బ‌తుకుమ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన కేటీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకున్నదని తెలిపారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.

- Advertisement -

పిల్లాపాప‌ల‌తో సంతోషంగా ఉండాలి..

ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ సందర్భంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఆడబిడ్డలు, పిల్లాపాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందని తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టతను గుర్తించిన నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని వివరించారు. మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక కానుకలను అందజేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను ఆటపాటలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని తెలంగాణ ఆడబిడ్డలను కేసీఆర్‌ కోరారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతిమాత బతుకమ్మ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ప్ర‌కృతిని ఆరాదించే ఏకైక పండుగ‌..

తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదని కేటీఆర్‌ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ అన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ అని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరుతూ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement