Monday, March 25, 2024

సిఎం కేసీఆర్‌ స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ : సంతోష్‌ కుమార్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మొక్కలు పెంచడంపై గత 25 సంవత్సరాలుగా సిఎం కేసీఆర్‌ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించినట్లు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తెలిపారు. హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాల వలన రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీ శాతం 33 శాతానికి పెరిగిందన్నారు. శనివారం హైదరాబాద్‌లో మట్టి కోసం మనం పేరుతో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌, సేవ్‌ సాయిల్‌ మూమెంట్‌ కలిసి సంయుక్తంగా సంగీత కచేరీని నిర్వహించాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సద్గురు చేపట్టిన మట్టిని రక్షించు ఉద్యమానికి అన్ని విధాల మద్దతు ఇస్తామని అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని, తన వంతుగా సేవ్‌ సాయిల్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తాగునీరు, సాగునీరు ఇబ్బంది ఉండేదని, రాష్ట్రం ఏర్పడ్డాక 8 ఏండ్లలో సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్‌ రహితంగా మార్చామన్నారు. మట్టి – మొక్కల మధ్య సంబంధాన్ని వివరిస్తూ సద్గురు చెప్పినట్లు మట్టిని కాపాడదామని ఎంపీ సంతోష్‌ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement