Saturday, April 20, 2024

దివ్యాంగులకు ప్రభుత్వం తీపికబురు.. మూడు చక్రాల మోటరైజ్డ్‌ వాహనాలు పంపిణీ

అమరావతి, ఆంధ్రప్రభ : సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురందించింది. వికలాంగులైన (ఆర్థోపెడిక్‌) వారికి మూడు చక్రాల మోటరైజ్డ్‌ వాహనాలను ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెలువరించింది. వాహనాల పంపిణీ, లబ్ధిదారుల ఎంపికకు అర్హతలు, తదితర అంశాలతో పలు మార్గదర్శకాలు సూచించింది. కొన్ని జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాహనాలు చేరుతున్నాయి. అర్హులైన వారికి ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన వికలాంగులకు వంద శాతం సబ్సిడీతో మూడు చక్రాల మోటరైజ్డ్‌ వాహనాలను పంపిణీ కోసం ప్రభుత్వం నియోజవర్గానికి పదేసి చొప్పున కేటాయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలకు 1750 వాహనాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో మహిళలకు 875 (50 శాతం), ఎస్సిలకు 140 (16 శాతం), ఎస్టిలకు 61 (7 శాతం), జనరల్కు 674 (77 శాతం) కేటాయించారు. వాహనాలను పొందడానికి 18 నుంచి 45 సంవత్సరాలు వయస్సు కలిగి 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు. డిగ్రీ ఆపైఅర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వయం ఉపాధి, ప్రయివేట్‌ ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న వారినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఏజెన్సీ, ప్రయివేట్‌ ఏజెన్సీ నుంచి గతంలో మోటార్‌ వాహనాలు పొందని వారినే అర్హులుగా గుర్తిస్తున్నారు. సొంత వాహనం ఉన్న వికలాంగులను అనర్హులుగా పక్కన పెడుతున్నారు. మూడు చక్రాల వాహనాల కోసం వికలాంగుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిని అధికారులు స్క్రూట్సీ చేసి అర్హులను ఎంపిక చేస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా ఎనిమిది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ తుది జాబితాను సిద్ధం చేస్తోంది. నియోజకవర్గానికి పదేసి చొప్పున కేటాయించినా ఇంకా పూర్తి స్థాయిలో జిల్లాలకు చేరలేదు. జిల్లాలకు ఇప్పటివరకు 30 శాతం వాహనాలు చేరినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో మిగిలిన వాహనాలు జిల్లాకు చేరుకుంటాయని అధికారులు చెప్తున్నారు. ఇదిలావుండగా, వికలాంగులకు ఇచ్చే వాహనాలకూ రాజకీయ పైరవీలు తప్పడం లేదు. వాహనం ఖరీదు రూ.1.30 లక్షల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. పూర్తి సబ్సిడీపై అందిస్తుండడంతో కొంతమంది ఎమ్మెల్యేలతో సిఫార్సు చేయిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేల లేఖల వల్ల తమకు వాహనాలు అందుతాయో లేదోనన్న ఆందోళన పలువురు దరఖాస్తుదారుల్లో నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement