Tuesday, September 19, 2023

Big Story : విక్రయానికి సర్కారు భూములు.. ఆదాయం కోసం ప్ర‌భుత్వం అన్వేష‌ణ‌

హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌ : ఆదాయ సముపార్జనకోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను విక్రయించడానికి చర్యలు చేపట్టింది. హెచ్‌ఎండీఏ పరిధిలోఉన్న స్థలాలను విక్రయించడంద్వారా ఆదాయం పెంచుకోవాలని, హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థలాలకే మంచి ధరలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోఉన్న స్థలాలను విక్రయించడం ద్వారా కనీసం రూ.500కోట్ల ఆదాయం సమకూరుతుం దని అధికారులు అంచనా వేస్తున్నారు.

భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని పొందడంతోపాటు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో అక్రమ లేఅవుట్లలో ఉన్న అక్రమ వెంచర్లలో ఫ్లాట్లను రెగ్యులరైజ్‌ చేయడానికి ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో ముందుగా శంకర్‌పల్లి, మేడ్చల్‌, శంషాబాద్‌, ఘట్‌కేసర్‌ జోన్ల పరిధిలో 688 వెం చర్లలో లక్షా 32వేల ఫ్లాట్లు క్రమబద్దీకర ణకు అర్హమైనవిగా గుర్తించారు. ఎవరైనా గతంలో అక్రమలే అవుట్‌లో ఫ్లాటు కొనుగోలు చేసిన ట్లైతే హెచ్‌ ఎండీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమబద్దీ కరణకు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు వాటికి అవసరమైన ఫీజులు చెల్లించి త్వరగా ప్రొసీడింగ్‌ పొందాలని సూచిస్తున్నారు.

- Advertisement -
   

ఈ మేరకు అర్హు లన దరఖాస్తుదారు లందరికి సమాచారం అందించడం జరిగింది. ఫీజులు, ఇతర ఛార్జీలు చెల్లించిన తర్వాతనే సంబంధిత ఫ్లాటుకు క్రమబద్దీకరణ పూర్తిచేసి ప్రోసీడింగ్స్‌ పత్రాలను అందించడానికి హెచ్‌ఎండీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. 1337 అక్రమలే అవుట్లలో ముందుగా 688 లేఅవుట్లలో ఫ్లాట్లను క్రమబద్దీకరించడం ద్వారా ఫీజుల రూపంలో మరో రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.

భూముల అమ్మకానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు..

ప్రభుత్వ భూములను అమ్మడానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించి వేలంపాట ద్వారా అమ్మకం చేయడానికి సిద్ధం అవుతుంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, తుర్కయంజాల్‌, కుర్మల్‌గూడ, తొర్రూర్‌లతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమిస్తాన్‌ పూర్‌లో స్థలాలను గుర్తించి ఈ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్‌ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రీబిడ్‌కు కొనుగోలు దారుల నుంచి అనూహ్యస్పందన రావడంతో హెచ్‌ ఎండీఏ అధికారులు ఉత్సాహంగా ముందుకు వెలుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఈ వేలం పాట ద్వారా కొన్ని ఫ్లాట్లను విక్రయించగా, మిగిలిన వాటికి రెండోదశలో విక్రయించడానికి అధికా రులు తాజాగా చర్యలు తీసుకుంటున్నారు.

ఒక్క అమిస్తాన్‌పూర్‌ మినహా మిగతా అన్ని స్థలాలు ఔటర్‌ రింగ్‌రోడ్డుకు లోపల, బయట సమీపంలో ఉండడంతో మంచి డిమాండ్‌ వస్తుంది. వీటికోసం సాధారణ, మధ్య తరగతి వర్గాల నుంచే కాకుండా రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది సొంతింటి కలను నేరవేర్చుకోవడానికి ఎలాంటి లిటిగేషన్‌ లేకుండా ఉండే స్థలాలు కావాలంటే హెచ్‌ఎండీఏ ద్వారా వేలం పాటలో తీసుకున్న ఫ్లాట్లకు పూర్తి రక్షణ ఉంటుందని భావిస్తున్నారు.

తొర్రూర్‌, బహదూ ర్‌పల్లి ప్రాంతంలో మధ్య తర గతి వారి కోసం అనువుగా 197 నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకుకూడా ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అ లాగే బహదూర్‌పల్లి, తుర్కయం జాల్‌, తొర్రూర్‌, కుర్మల్‌ గూడ తదితర ప్రాంతాలలో బహుళ అంతస్థుల నిర్మాణం కోసం 325 చదరపు గజాల నుంచి 1145 చదరపు గజాల వరకు గరిష్ట విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నా యి. వీటికి ఈనెల 14 నుంచి 23వ తేదీ వరకు ఈ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు ఇందులో పాల్గొని స్థలాన్ని సొంతం చేసుకోవాలని హెచ్‌ఎండీఏ అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement