Thursday, April 25, 2024

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆనుమతి.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2016 నుంచి ప్రభుత్వంలో విలీనానికి ముందు సర్వీసులో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు అనుమతిస్తూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల నేపధ్యంలో ఆర్టీసీలో 896 మందికి లబ్ది చేకూరనుంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై విలీనానికి ముందు కార్మిక సంఘాలు, విలీనం తర్వాత ఉద్యోగ సంఘాలు పలు సందర్భాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సైతం ఆయా సంఘాలు ఇచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల ముఖ్యమంత్రి ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపధ్యంలో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీలో ఖాళీలు, జిల్లా కలెక్టర్‌ పరిధిలోని వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.

ఉద్యోగ సంఘాల హర్షం
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోని కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌, పీటీడీ వైఎస్సార్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, ఆర్టీసీ కార్మిక పరిషత్‌ హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, వైఎస్సార్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్మిక పరిషత్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ శేషగిరిరావు, వైఎస్‌ రావు తదితరుల వేర్వేరు ప్రకటనలు జారీ చేస్తూ ఉత్తర్వుల విడుదలకు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఆర్టీసీ ఛైర్మన్‌ ఏ.మల్లిఖార్జున రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌-19 నేపధ్యంలో గత మూడేళ్లుగా కోవిడ్‌, ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెందిన, మెడికల్‌ అన్‌ఫిట్‌ ఉద్యోగుల కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని వారీ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement