Thursday, April 25, 2024

శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ఏపీ గవర్నర్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులు ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం విజయవాడ నుండి ప్ర‌త్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం చేరుకున్న గవర్నర్ తొలుత రత్నగర్భగణపతి స్వామి వారిని దర్శించుకుని హారతిని అందుకున్నారు. శ్రీమల్లికార్జునస్వామివారిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికా గుండంలో (సరస్వతీ నదీ అంతర్వాహిని) ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అనంతరం భ్రమరాంబాదేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కుటుంబ సభ్యులను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్నలు శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు, శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపికను గవర్నర్ దంపతులకు అందచేశారు. తొలుత శ్రీశైలం గంగాధర మండపం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కుటుంబ సభ్యులకు అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు ఉమామహేష్, ఎం. విజయలక్ష్మి, ఎ.లక్ష్మీ సావిత్రి, మేరాజోత్ హనుమంత్ నాయక్, డా.కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement