Thursday, March 28, 2024

చెక్​బౌన్స్​ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయునికి జైలు శిక్ష, 15లక్షల జరిమానా

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : చెక్​ బౌన్స్​ కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.15లక్షల జరిమానా విధిస్తూ ములుగు జ్యూడీషియల్​ ఫస్ట్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ డి.రామమోహన్​ రెడ్డి ఇవ్వాల తీర్పువెలువరించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాళ్లపెల్లి సురేష్..​ ములుగు ప్రాంతానికి చెందిన గండ్రకోట కుమార్​ నుంచి రూ.15లక్షలను అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించే క్రమంలో సురేష్​ 2012లో బ్యాంకు చెక్కును అందజేశాడు. ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్​ చేయగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో బౌన్స్​ అయ్యింది. దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే సురేష్​ ఇలా చేశాడని 2012లో కుమార్​ కోర్టును ఆశ్రయించాడు.

ఇక‌.. ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలోని అదాలత్​ లోగల కోర్టులో వాదనలు జరిగాయి. 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా ములుగు కోర్టుకు కేసు (సీసీ నెంబర్​ : 31/2016) మారింది. కాగా, లాయర్​ కె.సునీల్​.. కుమార్​ తరఫున వాదనలు వినిపించారు. నిందితుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాళ్లపెల్లి సురేష్​కు 6 నెలల జైలు శిక్షతోపాటు రూ.15లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.

కాగా, హన్మకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి సురేష్​ గతంలో ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలంలో (సెకండరీ గ్రేడ్ టీచర్​ ) ఎస్టీజీగా పనిచేశారు. తనకు న్యాయస్థానంపట్ల పూర్తినమ్మకం ఉండి పదేళ్లుగా పోరాటం చేశానని కుమార్​ తీర్పుపట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement