Thursday, April 18, 2024

ప్రైవేటుకు దీటుగా ప్ర‌భుత్వ బ‌డులు : మంత్రి ఎర్రబెల్లి

మన ఊరు – మన బడిలో భాగంగా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభోత్సవం చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే కొత్తూరు పాఠశాల నెంబర్ 1గా తయారైంద‌ని, దాదాపు రెండు కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు జరిగాయ‌న్నారు. ప్రైవేట్ స్కూల్ కి దీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటార‌న్నారు. ప్రభుత్వ పాఠశాల లో మౌలిక వసతుల కల్పన కోసం 7 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చామ‌న్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియ బోధన కోసం ప్రభుత్వ టీచర్ లకు మంచి ట్రైనింగ్ ఇప్పించిందన్నారు. ప్రైవేట్ స్కూల్ లో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదివించే రోజులు పోవాల‌న్నారు. గ్రామస్తులు అందరూ మీ ఊరి బడి లోనే మీ పిల్లలను చదివించాల‌న్నారు. మీ ఊరి బడిని కాపాడుకోవాలిసిన బాధ్యత మీ అందరి మీద ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింద‌న్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బడి నుండి వచ్చాక ఆరోజు పాఠశాలలో ఏం నేర్చుకున్నారో తెలుసుకోవాల‌న్నారు. సీఎం కెసిఆర్ దయవల్ల ప్రభుత్వ స్కూల్స్ ప్రపంచ పోటీకి దీటుగా తయారు అయ్యాయి. 3 విడతలుగా మొత్తం ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ అశ్వని తానాజి, డీఈవో, డీఆర్డీవో, స్ధానిక ప్రజా ప్రతినిధులు, స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement