Friday, April 26, 2024

Delhi | తెలంగాణ భవన్ రూమ్‌లు పశువుల కొట్టం కంటే అధ్వాన్నం.. క్లీన్ భవన్ డ్రైవ్ చేపడతా : గోనె ప్రకాశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రూమ్‌లు పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా భవన్‌లో బస చేస్తున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్‌లో సరైన వసతులు లేవని చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్ రూమ్‌ల కంటే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్‌లు శుభ్రంగా ఉన్నాయని గోనె అన్నారు. ఒక్కో గదికి ఇద్దరు వ్యక్తులకు రోజుకి ఆరు వేలు వసూలు చేస్తున్నా బాత్రూముల్లో కనీస సౌకర్యాలు లేవని తెలిపారు.

తాగునీటి సౌకర్యం లేకపోవడంతో బాత్రూంలో నీళ్ల తాగాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. లిఫ్ట్ పని చేయకపోయినా పట్టించుకునే వారే లేరని గోనె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ భవన్‌లోనూ ఇలాంటి పరిస్థితులు లేవని తెలిపారు. జూన్ 30లోపు చర్యలు తీసుకోకపోతే తానే తెలంగాణ భవన్ బాత్రూమ్స్ శుభ్రం చేయిస్తానని, కూలర్లు పెట్టిస్తానని అన్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి క్లీన్ డ్రైవ్ చేపడతానని తెలిపారు.

ఢిల్లీలో పబ్లిక్ టాయిలెట్లు ఎలా ఉన్నాయో, తెలంగాణ భవన్ టాయిలెట్లు ఎలా ఉన్నాయో ఫోటోలు అందజేస్తానని చెప్పారు. తెలంగాణలో నిర్భంధం, నియంత పరిపాలన కొనసాగుతోందన్న ఆయన, హైదరాబాద్ వెళ్లాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి తెలంగాణ భవన్‌లో సమస్యలపై వివరిస్తానని వెల్లడించారు. భవన్‌ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని… శుభ్రత, సౌకర్యాలపై చర్యలు చేపట్టాలని గోనె ప్రకాశ్ డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement