Thursday, April 25, 2024

2022లో బంగారం భగభగ‌.. గోల్డ్ రేట్లు బాగా పెరిగే చాన్స్..

2021 రెండో అర్ధభాగంలో కొంతవరకు డీలాపడిన బంగారం కొత్త ఏడాది 2022లో మెరుపులు మెరిపించొచ్చు. 10 గ్రాముల పసిడి ధర రూ.55 వేల స్థాయి దాటొచ్చనే అంచనాలున్నాయి. కరోనా మహమ్మారి బాధలు, ద్రవ్యోల్బణం కష్టాలు, యూఎస్‌ డాలర్‌ దృఢతం నేపథ్యంలో బంగారం రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. కాగా 2020లో పసిడి ధర ఆగస్టులో ఎంసీఎక్స్‌పై రికార్డ్‌ స్థాయి రూ.56,200లకు చేరింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వర్ణం దాదాపు రూ.48వేలుగా ఉంది. అంటే జీవితకాల గరిష్ఠం నుంచి 14 శాతం తక్కువగా ఉంది. జనవరి 2021 స్థాయితో పోల్చితే 4 శాతం కనిష్ఠంగా ఉంది. అయితే ప్రస్తుత ధర కూడా అంతర్జాతీయ ధరలతో పోల్చితే 3 శాతం ఎక్కువగానే ఉంది. అయితే బంగారం ధరల ఈ స్థాయిలో పెరగడానికి దేశీయ కరెన్సీ రూపాయి బలహీనతే కారణంగా ఉంది. ఈ ఏడాది బంగారం ధర పెద్దగా పెరగకపోవడానికి ఈకిటీ మార్కెట్లలో ద్రవ్యలభ్యత ఎక్కువగా ఉండడమే కారణమని కామన్‌ట్రెండ్స్‌ కో-ఫౌండర్‌, సీఈవో జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ విశ్లేషించారు.

కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ నేపథ్యంలో యూరప్‌ దేశాలతోపాటు అమెరికా సహా పలు దేశాల్లో ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరెన్సీలు బలహీనమైతే బంగారం రేట్లు పెరిగే సూచనలున్నాయని త్యాగరాజన్‌ అన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ ధర 1791 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో భారత్‌లో ఎంసీఎక్స్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ డిసెంబర్‌ 29న రూ.47,740గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement