Monday, September 25, 2023

దైవ దర్శనానికి వెళుతూ… అనంతలోకాలకు

పులిచెర్ల, ప్రభన్యూస్‌ : దైవ దర్శనానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో అనంత లోకాలకు వెళ్ళిన సంఘటన పులిచెర్ల మండలంలో శనివారం వేకువజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… నంద్యాల పట్టణం ఎన్‌ జీఓ కాలనికి చెందిన విమల (52), శివమ్మ (45), ప్రతాప్‌ రెడ్డి (39), లక్ష్మీదేవి (54), నాగమణి, రమేష్‌, రామతులసమ్మ, సుష్మ, తనుష్‌ తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై దేవుడు దర్శనానికి తుఫాన్‌ వాహనంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు బయలుదేరారు. పులిచెర్ల మండలం ఎంజేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మలుపు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం 4 గంటల సమయంలో ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా ఆగిపోయింది.

దీంతో లారీ వెనుకనే వేగంతో వస్తున్న తుఫాన్‌ వాహనం లారీని ఢీకొంది. వేకువజామున సమయం కావడంతో కారులో వస్తున్న అందరూ నిద్రమత్తులో ఉండగా ఆ నిద్రలోనే విమల, శివమ్మ, ప్రతాప్‌ రెడ్డి, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందారు. నిద్ర మత్తులో ఏమి జరిగిందో అర్థం కాక క్షతగాత్రుల హాహాకారాలతో ప్రమాద ప్రాంతం దద్దరిల్లింది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుండి లారీ మరియు తుఫాన్‌ వాహనం డ్రైవర్లు ఇద్దరూ పారిపోయాడు. ప్రమాద జరిగిన సమాచారం అందుకున్న కల్లూరు సీఐ ఆశీర్వాదం, ఎస్సై రవిప్రకాష్‌ రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.

- Advertisement -
   

తీవ్రంగా గాయపడిన నాగమణి, రమేష్‌, రామతులసమ్మ, సుష్మ, తనుష్‌ లను చికిత్స నిమిత్తం ముందుగా 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. ప్రమాదం జరిగిన వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పీలేరు మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు నంద్యాల నుంచి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలను చూసి బోరున విలపించారు.

డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదం సీఐ ఆశీర్వాదం లారీ, తుఫాన్‌ వాహనం డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే ఇంతటి ప్రమాదం జరిగిందని కల్లూరు సీఐ ఆశీర్వాదం తెలిపారు. రహదారిపై వెళుతున్న లారీ ఒక్క సారిగా ఆగిపోవడంతో వెనుకనే అతి సమీపంలో వస్తున్న తుఫాన్‌ వాహనం ఢీకొందన్నారు. ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉందని సీఐ తెలిపారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు డిఎస్పి

ఏంజెఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థలాన్ని చిత్తూరు డిఎస్పి శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వీరి వెంట సీఐ ఆశీర్వాదం, ఎస్సైలు హరిప్రసాద్‌, రవిప్రకాష్‌ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement