Friday, April 19, 2024

వరంగల్‌ కలెక్టరేట్‌ నిర్మాణానికి జీవో విడుదల.. ఏజే మిల్లు గ్రౌండ్‌లో 27 ఎకరాల స్థలంలో నిర్మాణానికి అనుమతులు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీస్సులతో, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంపూర్ణ సహకారంతో వరంగల్‌ జిల్లా అధునాతన సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి మార్గం సుగమమైందని వరంగల్‌ తూర్పు శాసన సభ్యులు నన్నపునేని నరేందర్‌ సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్‌ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేయడంతో పాటు పరిపాలన భవన నిర్మాణాల మంజూరుకు ఇతోధిక తోడ్పాటునందించిన సీఎం కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌లను జిల్లా ప్రజలు చిరకాలం గుర్తించుకుంటారని చెప్పారు. మొత్తం ఈ ప్రక్రియలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎంతో సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు.

అలాగే వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిల తోడ్పాటు మరువలేనిదన్నారు. 27 ఎకరాల సువిశాల స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించాలని చేనేత జౌళిశాఖకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు గురువారం జారీ అయ్యాయి. జిల్లాల పునర్విభజనతో వర ంగల్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఇక్కడి నర్సంపేట రోడ్డులోని లక్ష్మీపురం, ఖిలావరంగల్‌ రెవెన్యూ శివారులో అజంజాహి మిల్స్‌ స్థలంలో నిర్మించాలనే ప్రతిపాదన తొలుత సి ద్దమైందని ఎమ్మెల్యే నరేందర్‌ చెప్పారు. దీనికి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సుముఖత తెలపడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తనతో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సీఎం కేసిఆర్‌ను కలిసి వివరించినట్లు నరేందర్‌ తెలిపారు.

- Advertisement -

సీఎం ఆమోదంతో ఆజంజాహి మిల్స్‌ భూముల్లో కలెక్టరేట్‌ భవననిర్మాణానికి క్లీయరెన్స్‌ వచ్చిందని నరేందర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి అనుతులతో కూడిన జీఓను ఇచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహకరించినటువంటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలి యజేశారు. ఆజంజాహి మిల్లు స్థలంలో కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన సీఎం కేసిఆర్‌, సహకరించిన మంత్రి కేటిఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నరేందర్‌ చిత్రపటాలకు నియోజకవర్గ ప్రజలు, కార్పోరేటర్లు క్షీరాభిషేకాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement