Saturday, April 20, 2024

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. బ్రాహ్మణులకు రాజకీయంగా సహకరిస్తాం : బండి సంజయ్

జనగామ : బ్రాహ్మణులకు కూడా రాజకీయంగా సహకరిస్తాం.. మీరందరూ క్షేమంగా ఉంటే.. మేము సంతోషంగా ఉంటాం.. కులాల ప్రాతిపదికన టికెట్స్ కాదు.. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తాం.. అందులో భాగంగా బ్రాహ్మణులు సహా అందరికీ టికెట్స్ ఇస్తాం.. రాబోయే రోజుల్లో పక్కా బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జనగామ జిల్లా లింఘాలఘన్ పూర్ మండలం కుందారం గ్రామంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.. ఈ సందర్బంగా అర్చకులతో బండి సంజయ్ కి ఆశీర్వాద కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆధ్వర్యంలో అర్చకులు తమ సమస్యలను బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. బ్రాహ్మణులు చాలా వరకు కడు పేదరికంలో ఉన్నారు. కనీసం రూ.1000 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

బ్రాహ్మణులకే కాదు.. కుల, మతాలకు అతీతంగా ఉచిత విద్య, వైద్యం తప్పనిసరిగా అందించాలి. తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు చట్టసభల్లో కనీసం 2 ఎంపీ, 4 ఎమ్మెల్యే స్థానాల్లో అవకాశం కల్పించాలి. ఇంకా వారి సమస్యలను బండి సంజయ్ ని కోరారు.. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ 10 స్థానాల్లో బ్రాహ్మణులు గెలిచేలా ఉంటే 10 మందికి అవకాశం ఇస్తాం. ప్రతి జిల్లాలో వేద పాఠశాలలు ఉండే విధంగా నా వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో బ్రాహ్మణుల కు రక్షణ లేకుండా పోయింది. రామాయణం, భగవద్గీత‌ను కూడా కించపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే… ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. అర్చకులను, దేవుళ్లను కించపరచడం మంచి సంస్కృతి అనిపించుకోదన్నారు. బీజేపీ అంటేనే సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించే పార్టీ అన్నారు. అనంతరం అగ్రవర్ణాలలోని పేదలకు రిజర్వేషన్లు కల్పించిన ప్ర‌ధాని మోడీ అని ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement