Wednesday, April 24, 2024

విశాఖలో చెత్త నుంచి విద్యుత్‌.. 15 మెగావాట్ల ఉత్పత్తికి ప్లాన్​

ప్రభన్యూస్ : మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మరో అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో ఏర్పాటు చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పాదన మాత్రం కొనసాగుతుంది. జీవీఎంసీ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో 110 ఎకరాల స్థలాన్ని జిందాల్‌ సంస్థకు కేటాయించారు. 2016 ఫిబ్రవరిలో జీవీఎంసీ జిందాల్‌ సంస్థతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సుమారు రూ.350 కోట్లతో ఈ ప్రాజెక్టును జిందాల్‌ సంస్థ నిర్మించింది. ఒప్పందం ప్రకారం ప్రతీరోజు జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్‌ల నుంచి సేకరించిన 950 మెట్రిక్‌ టన్నుల చెత్తను కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు జీవీఎంసీ తరలించాల్సి ఉంటుంది. మరో 250 మెట్రిక్‌ టన్నుల చెత్తను శ్రీకాకుళం, విజయనగరం, నెల్లిమర్ల కార్పొ రేషన్‌ల నుంచి తరలిస్తారు. తడి, పొడి చెత్తలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను వేరు చేసి తదుపరి విద్యుత్‌ ఉత్పాదనకు శ్రీకారం చుడతారు. ప్రతీరోజు ఈ ప్రాజెక్టు నుంచి 15 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 25 ఏళ్లు పాటు ఈ ప్రాజెక్టును జిందాల్‌ సంస్థ నిర్వహిస్తుంది. తదుపరి కాలపరిమితి ముగియగానే జీవీఎంసీకి అప్పగించనున్నారు.

11 నుంచి 12 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి..

కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో జిందాల్‌ సంస్థ నిర్మించిన చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. జనవరిలోనే ట్రైల్‌ రన్‌ నిర్వహించారు. ఫిబ్రవరి నుంచి విద్యుత్‌ ఉత్పాదన ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతీరోజు 11 నుంచి 12 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం సింగిల్‌ బాయిలర్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కానుండగా ఇలా వచ్చిన విద్యుత్‌ను ఈపీడీసీఎల్‌కు తరలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement