Wednesday, April 24, 2024

కాంగ్రెస్‌లోకి ప్ర‌జాగాయ‌కుడు గద్దర్‌.. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రజా యుద్ధనౌక గద్దర్‌ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలనే ఆలోచనతో ఉన్న ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ వేదికను ఉపయోగించుకోకున్నారు. నూతనంగా నిర్మించిన పార్లమెంట్‌ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేలా కేంద్రంపై కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చేలా చూడాలని భట్టికి వినతిపత్రం ఇచ్చేందుకు గద్దర్‌ బుధవారంనాడు సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అక్కడే ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

జాతిని ఏకం చేయడానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని గద్దర్‌ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరగా.. అందుకు గద్దర్‌ స్పందిస్తూ తెలంగాణలోకి రాహుల్‌గాంధీ యాత్ర ప్రవేశించాక ఆయనతో కలిసి నడుస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరితో మరింత బలం వస్తుందని భట్టి సూచించగా.. అందుకు గద్దర్‌ కూడా సానుకూలంగానే స్పందించారు. కాంగ్రెస్‌లో చేరి పార్లమెంటరీ డెమోక్రసీలో పాల్గొని పార్లమెంటుకు పోటీ చేయాలని గద్దర్‌ను భట్టి కోరారు. పార్లమెంటుకు పోటీ చేసే విషయంలోనూ గద్దర్‌ సానుకూలంగానే స్పందించారు. భట్టి విక్రమార్క, గద్దర్‌ మధ్య జరిగిన చర్చలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు గద్దర్‌ను పెద్దపల్లి పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక వేళ గద్దర్‌ కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీకి మేలు జరుగుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి అంబేద్కర్‌ అని, అలాంటి వ్యక్తి పేరు నూతన పార్లమెంట్‌ భవనానికి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లిdలో తీర్మానం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని భట్టిని కోరినట్లు ఆయన తెలిపారు. గద్దర్‌తో పాటు భట్టిని కలిసిన వారిలో ఆలిండియా ఎస్సీ, ఎస్టీ కాన్ఫిడ్రేషన్‌ అధ్యక్షులు మహేష్‌రాజు, నాయకులు దయానంద్‌, డి.పవన్‌కుమార్‌, హనుమంతరావు, చేతన్‌ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement