Wednesday, April 24, 2024

లడఖ్‌లో జీ-20 సమావేశాలు.. జమ్ము కశ్మీర్ లో తొలి అంతర్జాతీయ సదస్సు

ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్‌ 370ను రద్దు చేసి, జమ్ముకశ్మీర్‌ను విభజించిన తర్వాత మొదటిసారి అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న జీ-20 దేశాల సదస్సు జమ్ముకశ్మీర్‌లో జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో సదస్సును లడఖ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై స్పందిస్తూ, సదస్సులో పాల్గొనే సభ్యదేశాల నేతలు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడంపై దృష్టి పెట్టాలని, రాజకీయాలు చేయడంపై కాదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సూచించారు. 2019లో జమ్ముకశ్మీర్‌ మరియు లడఖ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అంతర్జాతీయ సదస్సులు జరగలేదు. జీ-20 సదస్సు మొదటి అంతర్జాతీయ సదస్సు కానుంది. సదస్సు నిర్వహణ కోసం గృహ మరియు పట్టణాభివృద్ధి విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని జూన్‌ 23న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించనున్న జీ-20 నేతల సదస్సు కోఆర్డినేషన్‌కు ఈ కమిటీని నియమించడం జరిగింది. జీ -20 సమావేశాల కోసం లడఖ్‌ లెప్టినెంట్‌ గవర్నర్‌ ఆర్‌ కె మాథ్యూ సీనియర్‌ ఐఏఎస్‌ మరియు ఐపీఎస్‌ అధికార్లను యుటీ- లెవల్‌ నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు.

చైనా, ఇండియాల మధ్య లడఖ్‌ లోని వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చైనా, ఇండియాల సైన్యం గత రెండేళ్లుగా వాస్తవాధీన రేఖ వద్ద మోహరించి ఉంది. జీ 20 సమావేశాలకు హాజరు కానున్న జీ-20 దేశాల అగ్రనేతలను లడఖ్‌లో పర్యటనకు తీసుకు వెళ్లి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించాలన్నది భారత్‌ ఉద్దేశ్యం కాగా, చైనా దానిని వ్యతిరేకిస్తోంది. అయితే, జీ-20 నేతల లడఖ్‌ పర్యటనపై ఇప్పటి వరకు అధికారులు నోరు మెదపడం లేదు. జీ -20 దేశాల్లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ,జపాన్‌, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా, సౌత్‌ కొరియా, మరియు టర్కీ సభ్యదేశాలుగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement