Saturday, October 12, 2024

రేపటినుంచి కోవిడ్‌ బూస్టర్‌ డోస్‌.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పిహెచ్‌సిలలో అందుబాటులో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా దేశంలో ప్రతీ రోజూ 19 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది.గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్‌ మాండవీయ అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నియంత్రణకు టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచాలనీ, ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్‌ సంబంధిత మందులను పంపిణీ చేయాలని పేర్కొన్నారు.

రాష్ట్రానికి 15 లక్షల బూస్టర్‌ వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలని సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, కేంద్రం ఏ రాష్ట్రానికీ వ్యాక్సిన్‌ ఉచితంగా పంపిణీ చేయదనీ, ఎవరికి వారే సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర్ర ప్రభుత్వం 5 లక్షల కార్బేవ్యాక్స్‌ టీకా డోసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం నుంచి రాష్ట్ర్రంలోని అన్ని పిహెచ్‌సిలు, యూపీహెచ్‌సిలలో వైద్య సిబ్బంది ఈ వ్యాక్సిన్‌ వేస్తారు. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్‌ పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ దేశంలో పెరుగుతున్న కేసుల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మొదటి రెండు డోసులు కోవిషీల్డ్‌, లేదా కోవాగ్జిన్‌ తీసుకున్నా బూస్టర్‌ డోస్‌గా కార్బేవ్యాక్స్‌ తీసుకోవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, గత కొంత కాలంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ల కొరత కారణంగా బూస్టర్‌ డోసుల పంపిణీ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో మాదిరిగా సరఫరా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్‌ తయారీ సంస్థ బయోలాజికల్‌ ఈ నుంచి 5 లక్షల కార్బో వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement