Wednesday, April 17, 2024

బద్ధకానికి Tonic …ఉచితమొద్దులే!


సంక్షేమం పేరుతో ఉచితంగా నగదు
అడగకుండా సంక్షేమ తాయిలాలు
అవసరం లేని రంగాల్లోనూ అమలు
నజరానాలతో పనీపాటపై అశ్రద్ధ
కాలక్షేపంతో చేవలేని నవతరం
దేశం ఆర్థికం పైనా ఎఫెక్ట
ఒకప్పుడు కీలక రంగాల్లోనే పరిమిత సబ్సిడీలు

ఇప్పుడు ఓట్ల తాయిలాలుగా పథకాలు
చివరకు డ్వాక్రాలోనూ వ్యాపారం
దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం
విద్య, వైద్యం, వ్యవసాయం, గృహ వసతికే సాయం అవసరం
మిగిలిన రంగాలకు ఉచిత నగదు అనుచితం శ్రీ మేలుకోకపోతే ముప్పే నిపుణుల హెచ్చరిక


నగదు బదలీ విధానం అమల్లోకొచ్చాక నెమ్మదిగా పని చేయాలన్న ఆలోచన తగ్గుతోంది. కొన్నివర్గాల్లో ఇది బద్దకాన్ని పెంచుతోంది. యువతతో పాటు కొన్ని లక్షల కుటుంబాలు భవిష్యత్‌ను నిర్దేశించుకోవడం లేదు. అందుకవసరమైన రీతిలో కష్టపడాలన్న ఆలోచనను పక్కనపెట్టేశాయి. పండగలు, పబ్బాలు, పర్వదినాలు, పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యాలు, చేస్తున్న వృత్తి, సామాజిక కార్యక్రమాల పేరిట దాదాపు ప్రతినెలా ఏదో రూపంలో ఈ కుటుంబాలకు నగదు అందుతోంది. అలాగని ఈ నగదు ఉత్పాదకతకు ఉపకరించడం లేదు…
(న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి):కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇటీవల దేశంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల పట్ల తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ముఖ్యంగా దేశంలో బద్దకస్తులు పెరుగుతున్నారు. పనిచేసి ఉత్పాదకత పెంచాలన్న ఆలోచన నెమ్మదిగా కొరవడుతోంది. క్రింది, మధ్యతరగతి ప్రజల్లో కష్టించి పనిచేయాలన్న ఆలోచన తగ్గుతోంది. ముఖ్యంగా పెద్దగా చదువుకోని యువత, మహిళల్లో ఇలాంటి భావాలు పెరుగుతున్నాయి. ఇది సమాజానికి, దేశానికి కూడా కీడు చేస్తుందన్నది అమిత్‌షా భయం. సమాజంలో ఇలాంటి దుస్థితి నెలకొనేందుకు ప్రభుత్వాలే కారణం. గతకొన్నేళ్ళుగా దేశవ్యాప్తంగా కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు ఉచిత పంపిణీ పథకాలు అమలు చేస్తున్నాయి. తదుపరి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమం పేరిట నేరుగా ఓటర్లకు నగదిస్తూ తమ వైపు ఆకర్షించే ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నాయి. ఓ వైపు దేశంలో సంపద పెరుగుతోంది. మరోవైపు సంపన్నుల సంఖ్య వృద్ధి చెందుతోంది. అంతకంటే వేగంగా పేదలు, పేదరికం పెరుగుతున్నాయి. ఓ వైపు సంపద మేటలేస్తుంటే మరోవైపు దుర్భర దారిద్య్రం తాండవిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వాలకు మాత్రం ఆదాయం లక్ష్యానికి మించి సమకూరుతోంది. మరో వైపు ప్రభుత్వాల ప్రాధాన్యతాక్రమాలు మారిపోతున్నాయి. గతంలో మౌలిక సదుపాయాల రంగం పూర్తిగా ప్రభుత్వాల అధీనంలోనే ఉండేది. కానీ ఇప్పుడు ఈరంగం ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల పెట్టుబడులకు నిలయంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకు పెరుగుతున్న ఆదాయాన్ని నేరుగా నగదు రూపంలో వివిధ పథకాల పేరిట ప్రజలకు అందించడం మొదలెట్టింది.
తాయిలాలు… దుష్రభావం
ఈ విధానం అమల్లోకొచ్చాక నెమ్మదిగా పని చేయాలన్న ఆలోచన తగ్గుతోంది. కొన్నివర్గాల్లో ఇది బద్దకాన్ని పెంచుతోంది. యువతతో పాటు కొన్ని లక్షల కుటుంబాలు భవిష్యత్‌ను నిర్దేశించుకోవడం లేదు. అందుకవసరమైన రీతిలో కష్టపడాలన్న ఆలోచనను పక్కనపెట్టేశాయి. పండగలు, పబ్బాలు, పర్వదినాలు, పిల్లల చదువులు, పెద్దల ఆరోగ్యాలు, చేస్తున్న వృత్తి, సామాజిక కార్యక్రమాల పేరిట దాదాపు ప్రతినెలా ఏదో రూపంలో ఈ కుటుంబాలకు నగదు అందుతోంది. అలాగని ఈ నగదు ఉత్పాదకతకు ఉపకరించడం లేదు. వీటితో ఉపకరణాలు కొనుగోలు చేస్తున్నారు. ఆధునిక వసతుల కోసం వెచ్చిస్తున్నారు. ఓ సాధారణ కార్మికుడు లేదా కూలీ చేసి వ్యక్తి నివాసంలో కూడా ఇప్పుడు రెండేసి ఎయిర్‌ కండీషనర్లు ఉన్నాయి. వాషింగ్‌ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు కొనుగోలు చేస్తున్నారు. అవసరానికి మించి అవసర సరుకుల్ని కూడా కొంటున్నారు. ప్రభుత్వాల నుంచి వస్తున్న ఉచిత పథకాల సొమ్మును ఇలా ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెట్టేస్తున్నారు. పైగా దేశవ్యాప్తంగా నెలవారీ చెల్లింపుల విధానం విస్తృతంగా అమల్లోకొచ్చేసింది. దీంతో తొలుత పెద్దగా పెట్టుబడి లేకుండానే వినిమయ వస్తువుల్ని ఇళ్ళకు తీసుకెళ్ళగలుగుతున్నారు. ఎలాగూ నెలనెలా ఏదొక రూపంలో ప్రభుత్వం నగదు అందిస్తోంది. ఈ మొత్తాన్ని నెలవారీ వంతులుగా చెల్లిస్తున్నారు.
ఆర్థిక సాయం… పక్కదారి
గతంలో ఆహార దినుసుల్ని మాత్రమే ప్రభుత్వాలు ఉచితంగా లేదా సబ్సిడీ ధరలపై పంపిణీ చేసేవి. ఇప్పుడు పిల్లాడ్ని స్కూల్‌కు పంపిస్తే నగదు, విద్యాభ్యాసం సందర్భంగా ఉపకార వేతనాలు, ఫీజుల చెల్లింపు కోసం నగదు జారీ, కుల వృత్తులకు ప్రోత్సాహం పేరిట నగదు. వాహనాలు, ఇతర ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నగదు ప్రోత్సాహ పథకాలు అమలౌతున్నాయి. అలాగే దశవ్యాప్తంగా డ్వాక్రా సంఘాలకు లక్షల రూపాయల రుణాలు అందుతున్నాయి. తక్కువ వడ్డీ లేదా జీరో వడ్డీపై ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. వాస్తవానికి ఇలా బ్యాంకుల ద్వారా అందిన రుణాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక సమృద్ధి కలిగే వ్యాపార, పారిశ్రామిక సంస్థల్ని నిర్వహించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బ్యాంకులు నామమాత్రపు వడ్డీపై ఇస్తున్న రుణాల్ని మహిళా సంఘాలు నూటికి 6రూపాయల నుంచి 12రూపాయల ధరపై వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాయి. వీరంతా ఇప్పుడు వడ్డీ వ్యాపారులుగా మారారు. అవసరాన్ని బట్టి వడ్డీ రేట్లు నిర్ణయిస్తున్నారు. 90శాతానికి పైగా మహిళా సంఘాలు వడ్డీ వ్యాపారంపైనే ఈ రుణాల్ని పెట్టుబడులు పెడుతున్నాయి. కేవలం 10శాతానికి లోపు సంఘాలే ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు, లేదా ఉత్పాదక సంస్థల్ని నిర్వహిస్తున్నాయి.
ఆదాయం తగ్గి… జీఎస్‌టీ పెరిగి
ఇలా ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆర్థిక సాయం పక్కదారి పడుతోంది. ఈ సొమ్మంతా మార్కెట్లను ముంచెత్తుతోంది. అవసరానికి మించి మార్కెట్లలో కొనుగోలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే జీఎస్‌టీ లక్ష్యాన్ని మించి వసూలౌతోంది. కొవిడ్‌ వంటి విపత్కర సమయంలో ప్రజల ఆదాయం తగ్గింది. కానీ ప్రతినెలా ప్రభుత్వానికి జమౌతున్న జీఎస్‌టీ మాత్రం పెరుగుతోంది. ఇందుక్కారణం ప్రభుత్వ పథకాల సొమ్మంతా కొనుగోళ్ళకు వెచ్చించడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆ నాలుగు రంగాలకు సాయం అవసరం
కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా సాయమందించాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, గృహనిర్మాణాలు ప్రభుత్వ సహకారం లేకుండా ఏ ఒక్కరు పూర్తి చేసుకోలేరు. సాధారణ ఇల్లు కట్టాలన్నా పది నుంచి పదిహేను లక్షలు అవసరం. ఇంతమొత్తాన్ని సాధారణ కుటుంబీకులెవరూ రుణంగా కూడా పొందలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇళ్ళ నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. సొంతిల్లుంటే సామాజిక పరపతి పెరుగుతుంది. భవిష్యత్‌కు ఒక భద్రత ఏర్పడుతుంది. అలాగే ఉచిత విద్యనందించడం రాజ్యాంగం కల్పించిన బాధ్యత విద్య ద్వారా వ్యవస్థలో మార్పులొస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబాలు స్థితిమంతులౌతారు. సంపద పెరుగుతుంది. ఉత్పాదకత వృద్ధి చెందుతుంది. గతంతో పోలిస్తే వైద్యం అత్యంత వ్యయభరితమైంది. లక్షల కుటుంబాలు వైద్య ఖర్చుల కారణంగా కుదేలౌతున్నాయి. ఆర్థికంగా తిరిగి కోలుకోలేని దుస్థితికి దిగజారిపోతున్నాయి. కార్పొరేట్‌ వైద్యాన్ని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలతోపాటు ఆర్థిక స్థితిని పరిరక్షించే వెసులుబాటు కలుగుతుంది. దేశంలో 62శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడున్నారు. సాగుపై పెట్టుబడులతో పోలిస్తే సమకూరుతున్న ఆదాయం అతిస్వల్పం. చిన్న, సన్నకారు రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోలేదు. ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాల్ని కొనుగోలు చేయలేరు. ఇందుకు ఖచ్చితంగా ప్రభుత్వ సాయం అవసరం. తద్వారా రైతు అప్పులపాలుకాకుండా కాపొడొచ్చు. ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఆహార భద్రత సమకూరుతుంది.
ఇటువంటి ఉత్పాదకత పథకాలకు మాత్రమే ప్రభుత్వాలు ఆర్థిక సాయమందించాలి. వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక ప్రోత్సాహాల్నివ్వాలి. అంతేతప్ప పనిచేసే సత్తువున్న వ్యక్తులకు ఆయాచితంగా ఆర్థిక సాయమందించి వారిలో బద్దకాన్ని పెంచితే భవిష్యత్‌లో దేశ ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముందన్నదే ఇటీవల అమిత్‌షా చేసిన వ్యాఖ్యల్లోని సారాంశంగా వీరు పేర్కొంటున్నారు.

దానాలు… ధర్మరాజుకు గుణపాఠం
ఉచిత పథకాలకు సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారతంలో దీని ప్రస్తావనుంది. ధర్మరాజు తన రాజ్యాన్ని ఎంతో గొప్పగా పాలిస్తున్నాడు. అడిగిన ప్రతి ఒక్కరికి దానధర్మాలు చేస్తున్నాడు. తనంతటి దానశీలి, ధర్మప్రభువు ప్రపంచంలో మరెక్కడా లేడని ఆయన భావించేవాడు. ఇదే విషయాన్ని ఆయనోసారి కృష్ణుని ముందు ప్రస్తావించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు కృష్ణుడు ధర్మరాజును వెంటబెట్టుకుని ఓ రాజ్యానికి తీసుకెళ్ళాడు. ఆ రాజ్యాన్ని మహాబల చక్రవర్తి అనే రాజు పాలిస్తున్నాడు. ఆ రాజ ్యంలోని ఓ ఊరికెళ్ళిన ధర్మరాజు, కృష్ణుడు ఓ ఇంటిముందు ఆగారు. అక్కడున్న మహిళను తమకు తాగేందుకు నీరివ్వాలని కోరారు. ఆమె ఇంట్లోకెళ్ళి రెండు బంగారు గ్లాసుల్లో నీరు తెచ్చించింది. వీరిద్దరూ ఆ నీటిని తాగేసి తిరిగి ఆ గ్లాసుల్ని ఆమెకిచ్చారు. ఆమె ఆ రెండుగ్లాసుల్ని బయటకు విసిరేసింది. ఆశ్చర్యపోయిన ధర్మరాజు ఆమెతో బంగారాన్ని దాచుకోవాలి గాని, బయటపడేస్తే ఎలా అమ్మా అంటూ ప్రశ్నించాడు. దానికామె బదులిస్తే తమ రాజ్యంలో ఎవరూ ఒకసారి వాడిన వస్తువుల్ని తిరిగి వాడమని బదులిచ్చింది. ఆరాజ్య ప్రజల సంపద గురించి ఆలోచిస్తూనే ధర్మారాజు మహాబల చక్రవర్తి ఆస్థానానికి చేరుకున్నాడు. కృష్ణుడు మహాబల చక్రవర్తికి ధర్మరాజును పరిచయం చేశాడు. ఈయన ప్రపంచంలోనే ఎక్కువ దానధర్మాలు చేసిన వ్యక్తి. తన రాజ్యంలో ఎవరు ఏం కోరినా కాదనకుండా దానంచేస్తారు. ఈ పేరు ధర్మరాజు అంటూ కృష్ణుడు పేర్కొన్నాడు. అయితే ఆ రాజు ధర్మరాజు మొహం కూడా చూడలేదు. సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.. కృష్ణా నా రాజ్యంలో ప్రజలకు సరిపడే పని ఉంది. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తారు. అందరి వద్ద సంపద ఉంది. నా రాజ్యంలో కష్టపడి పని చేయడం ఇష్టం. ఇక్కడెవరూ బిక్షం తీసుకోరు. దానధర్మాల కోసం ఎవరూ ఎదురుచూడరు. ఇచ్చినా తృణీకరిస్తారు. ఈ రాజు రాజ్యంలో పేదలు ఎక్కువగా ఉన్నట్లున్నారు. బద్దకస్తుల సంఖ్య ఎక్కువలా ఉంది. అందుకే అందరూ దానాల కోసం రాజు ముందు చేతులు చాస్తున్నారేమే అంతమందిని పేదలుగా ఉంచిన ఈ రాజు మొహం చూసేందకు కూడా సిగ్గుపడుతున్నానంటూ అన్నాడు. దీంతో ధర్మరాజు సిగ్గుపడి తలదించుకున్నాడు. అప్పటి వరకు తానే అధిక సంఖ్యలో దానధర్మాలు చేస్తున్న రాజుగా గర్వపడ్డ ధర్మరాజు సాయం పేరిట తన ప్రజల్ని తాను అడుక్కు తినేలా చేస్తున్నానని బాధపడ్డాడు. తానిచ్చే దానానికి అలవాటుపడ్డ ప్రజలు సోమరులుగా మారిన వైనాన్ని తెలుసుకున్నాడు.

ఉచిత పథకాలు… దివాళా పరిస్థితులు
1991లో భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్‌ క్రైసెస్‌లో భారత్‌ ఇరుక్కుంది. తన ఉద్యోగులకు జీతాల్ని కూడా చెల్లించలేకపోయింది. ఇందుక్కారణం 1980నుంచి 90మధ్యలో దేశ పాలకులు అనుసరించిన అస్తవ్యస్థ ఆర్థిక విధానాలే. పలు పథకాలు దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించే పరిస్థితి కొనితెచ్చాయి. 1991లో పి.వి. నరసింహరావు, మన్మోహన్‌సింగ్‌లు భవిష్యత్‌ దార్శనికతతో కఠిన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని తిరిగి గట్టెక్కించగలిగారు. 2008లో అమెరికా కూడా సబ్‌ ప్రైమ్‌ క్రైసెస్‌ ఎదుర్కొంది. ఆ సమయంలో అమెరికా వాసులు ఖర్చులు తగ్గించుకోవాల్సి వచ్చింది. దీంతో విదేశీ పర్యటనలు మానుకున్నారు. అయితే అమెరికా నుంచి వచ్చే పర్యాటక ఆదాయంపైనే ఆధారపడి పెద్దెత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న గ్రీస్‌ దేశం ఈ ప్రభావంతో దివాళా తీసింది. గ్రీస్‌లో పలు ఉచిత సంక్షేమ పథకాలు అమలయ్యేవి. ఇందుకు పర్యాటక ఆదాయంపైనే ఆధారపడే వారు. అమెరికాలో వచ్చిన సంక్షోభం పరోక్షంగా గ్రీస్‌ ఆదాయాన్ని దెబ్బకొట్టింది. దీంతో ఒక్కసారిగా గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. అప్పటి వరకు ఎలాంటి పరిశ్రమలు వాణిజ్యం వైపు ఆ దేశం దృష్టిపెట్టలేదు. విదేశీ పర్యాటకులు చల్లగా ఉంటే చాలనుకుంది. అప్పుడు దివాళా అంచుకు చేరుకున్న గ్రీస్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్దానం అనంతరం తిరిగి కోలుకుంది. ఆ తర్వాత సంక్షేమ పథకాలకు కోతపెట్టింది. ఉత్పాదకతపై దృష్టిపెట్టింది. అలాగే 70వ దశకంలో ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటైన వెనిజులా కూడా సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్ని సోమరిపోతుల్లా మార్చేసింది. చావెజ్‌ అధికారంలొకొచ్చేందుకు సవాలక్ష సంక్షేమ పథకాల్ని హామీగా ఇచ్చాడు. వెనిజులా పూర్తిగా చమురు విక్రయాలపైనే ఆధారపడ్డ దేశం. 2010తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కొత్తగా చమురు ఉత్పత్తి, విక్రయాలు ప్రారంభించాయి. దీంతో వెనిజుల చమురుకు డిమాండ్‌ తగ్గింది. ఆ దేశంలో ఉత్పత్తి పడిపోయింది. ద్రవ్యోల్బణం 3.73లక్షల శాతానికి పెరిగింది. ఆ దేశ కరెన్సీ చిత్తుకాగితాలకంటే చౌకగా మారిపోయింది. ఉచిత సబ్సిడీలు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. అప్పటివరకు పనీపాట చేయకుండా బద్దకాన్ని పెంచుకున్న యువకులు కత్తులు, పిస్టళ్ళతో లూటీలకు అలవాటుపడ్డారు. తిండిలేక జంతు ప్రదర్శనశాలల్లోని జంతువులన్నీ చచ్చిపోయాయి. దేశంలో నేర ప్రవృత్తి పెరిగింది. రొట్టె ముక్క కోసం బాలికలు శరీరాన్ని అమ్ముకునేందుకు కూడా వెనుకాడదని దుస్థితి నెలకొంది. వెనిజులాకు వెళ్ళొద్దంటూ పలు దేశాలు తమ పౌరుల్ని హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement