Saturday, April 20, 2024

మహిళా జర్నలిస్టుల ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన సీఎస్‌ శాంతి కుమారి (వీడియోతో..)

మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సీఎస్‌ శాంతి కుమారి ప్రారంభించారు. అనంత‌రం సీఎస్‌ మాట్లాడుతూ.. నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్‌లో భాగంగా 36 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉచిత ఆరోగ్యపరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహిళా జర్నలిస్టులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ మహిళా దినోత్సవం రోజున ఆదేశించారని, ఈ మేరకు ఆరోగ్య శిబిరం ప్రారంభిస్తున్నామని సీఎస్‌ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అక్రిడిటెడ్ మహిళా జర్నలిస్టుల కోసం మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్‌లో 10 రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గురువారం నుంచి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయ‌ని, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో పనిచేస్తున్న గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాస్టర్ హెల్త్‌చెకప్‌లో భాగంగా రక్త పరీక్ష (CBP), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement