Wednesday, April 24, 2024

ఈజీమని కోసం బంగారం పేరుతో మోసాలు.. గ్యాంగ్ ని పట్టుకున్న పోలీసులు

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో నకిలీ నోట్లు, నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనతో ప్రజలను మోసం చేస్తున్న గ్యాంగుని పోలీసులు పట్టకున్నారు. శుక్రవారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టు ఎస్సై సాయన్న తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు మండలంలోని రోల్ మామడలో గురువారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో టీఎస్ 07 FU 7394 నంబరు గల కారులో మహారాష్ట్ర కు చెందిన ముగ్గురు వ్యక్తులు దగ్గరున్న బ్యాగును తనిఖీ చేయగా.. బంగారు రంగులో ఉన్న చైన్లు 11 తులాల 30 గ్రాములు, చిల్ట్రెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్న 100 రూపాయల నకిలీ నోట్ల కట్టను స్వాధీనం చేసుకున్నారు.

అవి చూసి వారిపై అనుమానం వచ్చి విచారించగా తాము ముగ్గురితోపాటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కు చెందిన మరో ఇద్దరు కలసి ఒక గ్రూపుగా ఏర్పడి ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించలనే ఆశతో బంగారం రంగులోని గొలుసులను.. నిజమైన బంగారం అని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా గత నెల నేరడిగొండలో ఒక వ్యక్తి నుండి 2.30లక్షలకు 10 తులాల బంగారం ఇస్తామని 30 వేల నగదు తీసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ లో కూడా ఇలాగే ఒక వ్యక్తివద్ద అబద్ధం చెప్పి 80 వేలు తీసుకున్నట్లు వెల్లడించారు. జనాలను మోసాలు చేస్తూ తిరుగుతున్న ఈ గ్యాంగ్లోని ముగ్గురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురిని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement