Saturday, April 20, 2024

Delhi | ఏపీ బీజేపీలో ఘరానా మోసగాడు.. ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూళ్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉద్యోగాలు, పదవుల పేరుతో బాధితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకాన్నే ఫోర్జరీ చేసి నకిలీ నియామక పత్రాలు అందజేయడంతో అడ్డంగా దొరికిపోయారు. ఏప్రిల్ నెలాఖర్లోనే వెలుగుచూసిన ఈ ఘరానా మోసంపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సూత్రధారులు, పాత్రధారులను గుర్తించారు. పదవులు, ఉద్యోగాల పేరుతో మోసగించిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ విభాగంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్, ఆయన కుమారుడు సాయి దేవానంద్‌గా గుర్తించారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఎప్రిల్ నెలాఖర్లో ఓ మహిళ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని తనను ఆ కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నియమించారంటూ ఓ అపాయింట్మెంట్ లెటర్ చూపించింది. ఆ నియామక పత్రంపై కేంద్ర హోంశాఖ అజయ్ భల్లా సంతకం ఉండడంతో కిషన్ రెడ్డి కార్యాలయం వెంటనే ఆయన్ను సంప్రదించింది. దీంతో అసలు విషయం బయటపడింది. అజయ్ భల్లా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ నకిలీ నియామక పత్రాన్ని తయారు చేశారని గుర్తించి కిషన్ రెడ్డి కార్యాలయం, వెంటనే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -

ఏప్రిల్ 27న కిషన్ రెడ్డి కార్యాలయ అధికారి ప్రణవ్ మహాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అదే రోజు ఐపీసీ సెక్షన్లు 468, 471 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఆమె దగ్గర ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారో తెలుసుకున్నారు. ఈ చెల్లింపుల్లో కొన్ని బ్యాంకు లావాదేవీల రూపంలో జరిగాయి. దేవానంద్ కుమారుడు సాయికి చెందిన ‘అనూష సాయి ఏజెన్సీస్’ పేరుతో ఉన్న సంస్థకు చెల్లింపులు జరిపినట్టు తేలింది.

ఈ ఆధారాలన్నీ సేకరించిన పోలీసులు ఇంకా ఇలా ఎంత మందిని మోసగించారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసులతో పాటు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయం సహాయాన్ని ఢిల్లీ పోలీసులు కోరినట్టుగా తెలిసింది. ఈ మేరకు దేవానంద్‌పై ఇప్పటికే నమోదైన పాత కేసుల వివరాలను కూడా సేకరిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement